చేగుంట/ పెద్దశంకరంపేట/ వెల్దుర్తి, ఏప్రిల్ 20 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అన్నారు. చేగుంట మండ లంలోని మక్కరాజిపేట గ్రామంలో గురువారం సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్, ఎంపీటీసీ బండి కవితావిశ్వశ్వర్ తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కంటి చూపు తక్కువై ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు కంటి వెలుగు వరమన్నారు. కంటి వెలుగు శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కంటి అద్దాలు, మందులు, చుక్కల మందులు అందజేస్తారని, అవసరమైతే కంటి అపరేషన్లను పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే చేయిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాల్‌నర్సింహులు, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మీశంకర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు యాదిరెడ్డి, సత్తిరెడ్డి, పెంటయ్య, చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అనిల్‌కుమార్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉన్నారు.
పెద్దశంకరంపేట మండలంలోని మాడ్చెట్‌పల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ జంగం శ్రీనివాస్ ప్రారంభించారు. కంటివెలుగు శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, సర్పంచ్ రమ్యాఅశోక్ ఉన్నారు.
వెల్దుర్తి మండలంలోని ధర్మారం గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు కంటి అద్దాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలు పేదలకు వెలుగులు నింపుతున్నా యన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్‌రెడ్డి, డాక్టర్ మౌనిక, నాయకులు నరేందర్‌రెడ్డి, కిష్టారెడ్డి, సత్యంగౌడ్, విఠల్, పెంటయ్యతోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 20 : సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. గురువారం జిల్లాలో మొత్తం 13,865 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 9,578 మంది ఉండగా, వీరిలో 4,617 మంది పురుషులు, 4,961 మంది మహిళలు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో మొత్తం 4007 మందికి కంటి పరీక్షలు చేశారు.