జహీరాబాద్, ఫిబ్రవరి 8 : నిమ్జ్ ప్రాజెక్టు కోసం రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములను బలవంతంగా సేకరించవద్దని సీపీఎం జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రామచందర్ డిమాండ్ చేశారు. ఇటీవల నిమ్జ్ ప్రాజెక్టు కోసం సంబంధిత అధికారులు గ్రామానికి చెందిన రైతుల భూములు సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. 60 రోజుల్లో రైతులు తమ అభ్యంతరాలు తెలుపాలని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సీపీఎం ఆధ్వర్యంలో హుస్సేల్లి గ్రామానికి చెందిన నిమ్జ్ భూబాధితులు సంగారెడ్డి కలెక్టర్, జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవో, న్యాల్కల్ మండల తహసీల్దార్లకు భూములను బలవంతంగా సేకరించవద్దని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారవంతమైన భూముల్లో వాణిజ్య పంటలు, ఆహార పంటలు, పండ్లు, కూరగాయ పంటలను రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు.
భూములపైనే అధారపడి రైతులు కుటుంబాలను పోషించుకుంటారని పేర్కొన్నారు. సారవంతమైన భూమలను నిమ్జ్ ప్రాజెక్టు కోసం తీసుకుంటే రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించే భూముల్లో ఎలాంటి పరిశ్రమలు నెలకోల్పుతారో ముందుగానే తెలుపడం లేదని, వచ్చే పరిశ్రమాలు వెదజల్లే కాలుష్యంతో భూములు కలుషితమై, జంతువులు, ప్రజలు, అనేక రోగాలకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సారవంతమైన భూములు సేకరించవద్దని విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించే జాబితా నుంచి రెండు, మూడు పంటలు పండే సారవంతమైన భూములను మినహాహించాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో గ్రామ భూబాధితులు రాములు, శివరాజ్, రాజ్‌కుమార్, మారుతీ, కాశీనాథ్‌రెడ్డి, గుండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.