“మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే, ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే, స్ట్రెచర్ మీదకు పంపించిన్రు. ఇట్లే చేస్తే ఆ తరువాత మార్చురీకి పోతరు. అది కూడా గుర్తు పెట్టుకోవాలి”!.. అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను అన్నివర్గాలు ఖండిస్తున్నాయి.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి తన నోటికి అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడడంపై ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వివిధ వర్గాల వారు ఖండించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు తగవని, హుందాగా వ్యవహరించాలని రేవంత్‌కు పలువురు హితబోధ చేశారు. పదవికి వన్నెతెచ్చేలా పాలన సాగించాలని, ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై సీఎం చిల్లర వ్యాఖ్యలు చేయడం ఇకనైనా మానుకోవాలన్నారు. అధికారమదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదని హెచ్చరించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 13
సీఎం రేవంత్‌రెడ్డి ధోరణి వల్లే కాంగ్రెస్ పార్టీ మార్చురీకి వెళ్లే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడితే బాగుటుంది. రెండుసార్లు సీఎంగా విధులు నిర్వహించిన కేసీఆర్‌పై పదేపదే రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న భాష సక్రమంగా లేదు. ఈ విషయాన్ని రాష్ట్రంలోని ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారు. విద్యారంగాన్ని అన్ని విధాలుగా ధ్వంసం చేస్తున్న రేవంత్‌రెడ్డికి విద్యార్థిలోకం బుద్ధి చెప్పడం ఖాయం. సీఎం పనితీరు సక్రమంగా లేక రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆదరణ కోల్పోయింది.
-దాసరి ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, సిద్దిపేట
తెలంగాణ తొలి సీఎం, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రస్టేషన్కు గురై ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన మాట రాష్ట్రంలో చెల్లుబాటు కావడం లేదనే బాధతో స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఓ ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట తీరు సమాజం హేవగించుకునేలా ఉంది. ఇప్పటికైనా తన మాట తీరును ఆయన మార్చుకోవాలి. లేదంటే ప్రజల చేతిలో పరాభావం తప్పదు. సీఎం హోదాను అగౌరవ పరిచేలా ఆయన వ్యవహారం ఉంది.
-రజినీకాంత్‌రెడ్డి, యువజన నాయకుడు, సిద్దిపేట
ముఖ్యమంత్రి పదవి మామూలిది కాదు. ఆ పదవికి వన్నె తెచ్చేలా నేతలు వ్యవహరించాలి. సీఎం రేవంత్‌రెడ్డి తనస్థాయిని మరిచి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు బాగాలేవు. వెంటనే రేవంత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వ్యక్తిగత, కుటుంబ విషయాలకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఎవరూ సమర్థించరు.
– కడారి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సాపూర్, మెదక్ జిల్లా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు అత్యంత జుగుప్సాకరం. రాజకీయాల్లో పార్టీ బలోపేతం కోసం అధికారం కోసం ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేయడం సహజం. ఏమాత్రం మానవత్వం లేకుండా ఒక వ్యక్తి చావును ప్రస్తావించడం, మరణాన్ని కోరుకోవడం అత్యంత హేయం. రాజకీయాలు ఎలా ఉన్నా 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌కు కీడు జరగాలని ఏ తెలంగాణవాది కోరుకోడు. బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్‌పై తీవ్ర అసహనంతోనే రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నా. కేసీఆర్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను పార్టీలకతీతంగా తెలంగాణ ప్రజలు ఖండించాల్సిందే.
– లక్ష్మణ్‌రావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదు. ప్రస్తుత రాజకీయ నాయకులు విమర్శలు చూస్తే సామాన్య ప్రజలకే రాజకీయ నాయకులంటే విరక్తి కలుగుతున్నది. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి పదేండ్ల పాటు ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉన్న కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ సామాన్యులకు న్యా యం చేసే దిశగా ప్రభుత్వం ఉండాలి తప్పా పాలన అంతా ప్రతిపక్ష పార్టీలపై విమర్శల కోసం ముందుకు సాగడం సబబుకాదు. ఇప్పటికే 15నెలల పాలనలో ప్రభుత్వం సామాన్యులకు చేసింది శూన్యం. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదప్రజల గూడు చెదరగొట్టి రోడ్డున పడేసిన ప్రభుత్వం వారికి ఆదుకోవడంలో విఫలమైంది.
– దాసరి ఎగొండస్వామి, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, గజ్వేల్ (సిద్దిపేట జిల్లా)
సీఎం రేవంత్‌కు తెలంగాణ సోయి లేదు. ఆయన ఏనాడూ తెలంగాణ ఉద్యమం లో పాల్గొనలేదు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై సీఎం మాట్లాడిన తీరు ఏమాత్రం బాగాలేదు. ఆయన మాటలు తెలంగాణను అవమానించినట్లుగా ఉన్నాయి. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొట్లాడి కేసీఆర్ తెలంగాణను సాధించారు. అలాంటి గొప్ప నేత కీడును కోరడం రేవంత్‌కు తగదు. ఆంధ్రోళ్ల తొత్తు రేవంత్‌కి కనీసం గౌరవ మర్యాదలు తెలియవు.
-మాలోతు బీలునాయక్, తెలంగాణ ఉద్యమకారుడు, ధర్మారం(అక్కన్నపేట)
సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. మా న్యాయవాద బృందం తరపున ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన నేతపై, పదేండ్లు రాష్ర్టాన్ని పరిపాలించిన కేసీఆర్‌ను ఉద్దేశించి ‘స్ట్రెచర్మీదకు పంపిండ్రు, ఇట్లే చేస్తే మార్చురీకి పోతారని’ సీఎం వ్యాఖ్యానించడం సబబు కాదు. ఈ వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిని గౌరవించే సంస్కారం ఇదేనా.? రాజకీయం చేయాలి కానీ ఇంత దిగజారి చేయవద్దు. విమర్శలకు కూడా హద్దు ఉండాలి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. హుందాతనంతో కూడిన మాటలు, బాధ్యతతో కూడిన సంభాషణ ముఖ్యమంత్రి గౌరవాన్ని పెంచుతాయని గుర్తించాలి.
– దయాకర్‌రెడ్డి, న్యాయవాది, భానూర్ (సంగారెడ్డి జిల్లా)
సీఎం రేవంత్‌రెడ్డి హుం దాగా మాట్లాడాలి. ఆయన నోటినుంచి ఎప్పుడూ పరుష పదజాలం వస్తున్నది. సీఎం అంటే గొప్ప పదవి. సీఎం పదవిలో ఉన్నవారు ఎవరైనా అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ, రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో ఆయన ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. పథకాలు సరిగ్గా అమలు కాకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి సీఎం మాటలతో కాలం గడుపుతున్నారు. ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
– మల్లారెడ్డి, రైతు సంఘం నాయకుడు, కోహీర్ మండలం(సంగారెడ్డి జిల్లా)
అధికార మదమెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సీఎం ఇష్టానుసారంగా మాట్లాడటం ముఖ్యమంత్రి పీఠానికే అవమానకరం. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై ఆయన వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయి సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్లు పిచ్చిమాటలు మాట్లాడుతున్నడు. తూలనాడే తత్వాన్ని మార్చుకోవాలి.
– ఎడబోయిన తిరుపతిరెడ్డి, రైతు, హుస్నాబాద్
ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ సొంతం. తాను తెచ్చిన తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన గొప్ప పాలనాదక్షుడు కేసీఆర్. అలాంటి గొప్ప నేతపై కన్నుమిన్ను కానరాకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటికి ఎంత వస్తే అంత అన్నట్లుగా చిల్లర విమర్శలు చేయడం గర్హనీయం. సీఎం రేవంత్ తన స్థాయిని తెలుసుకొని మాట్లాడాలి. పాలన చేతకాక ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కేసీఆర్, ఆయన కుటుంబంపై పదేపదే పరుష పదజాలంతో విమర్శలు చేయడం రేవంత్‌కు అలవాటుగా మారింది.
సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలి. తనకంటే పెద్దవాడైన కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు తిడుతా అంటే ప్రజలు ఊరుకోరు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు కావడం లేదు. రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ముందు ముఖ్యమంత్రి సమర్థ పాలన అందించి చూపించాలి. అంతేకాని మాటలతో కాలక్షేపం చేస్తానంటే ప్రజలు ఊరుకోరు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం మరిచి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా రేవంత్ పెట్టుకోవడం దురదృష్టకరం.
– మాదాసు శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్, గజ్వేల్