జహీరాబాద్, జనవరి 15: పాత పంటలైన చిరు ధాన్యాలను పరిరక్షించే డీడీఎస్ మహిళా సంఘాల కృషి త్వరలోనే ఫలించనుందని, వాటికి మంచి రోజులు రాబోతున్నాయని రాష్ట్ర ఐసీఏఆర్, డైరెక్టర్ అటారి జోన్-10 డా. షేక్ ఎన్.మీరా పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని వడ్డి గ్రామంలో డీడీఎస్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 25వ పాత పంటల జాతరను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకూ వ్యవసాయ విధానంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల సంక్షోభంలో ఉన్నదన్నారు. పంటల సాగులో విపరీతంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడడం వల్ల భూసారం పూర్తిగా కలుషితమవున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే పప్పుధాన్యాలు, తినుబంఢారాలతో అనేక రోగాల బారిన పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
కనుమరుగవుతున్న పాత పం టలను పరిరక్షించడంలో డీడీఎస్ మహిళా సంఘాలు చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాలతోపాటు ఐక్యరాజ్య సమితిలో పాత పంటలైన చిరుధాన్యాల సాగు ఎంతో అవసరం ఉందని, ప్రతిఒక్కరూ చిరు ధాన్యాల సాగు గురించి ఆలోచించి వాటి చర్చించేలా చేసిన ఘనత పస్తాపూర్ డీడీఎస్ మహిళా సంఘాలకే దక్కిందన్నారు. ప్రస్తుతం చిరు ధాన్యాలకు ప్రపంచ వ్యాప్తంగా 135 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో 300 బిలియన్ డాలర్లకు చేరుకోబోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా చిరు ధాన్యాలకు పెద్ద పీటా వేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇందులోభాగంగా జహీరాబాద్ డీడీఎస్ చిరు ధాన్యాలను ప్రత్యేక బ్రాండ్‌గా గుర్తించి, దాని విశిష్టతను తెలియజేయాల్సి అవసరం ఎంతైన ఉందని, దీనికోసం తమ వం తు సహకారం అందిస్తామని చెప్పారు. చిరు ధాన్యాల పరిరక్షించడమే కాకుండా అధునిక పద్ధతులతో సాగును మరింత మెరుగుపర్చేందుకు జహీరాబాద్ డీడీఎస్-కేవీకేకు కేంద్రానికి ప్రాసెసింగ్ యూనిట్‌ను మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు గ్రహిత, ప్రముఖ వైద్య నిఫుణుడు ప్రసాద్‌రావు మాట్లాడుతూ.. పూర్వకాలంలో సేంద్రియ ఎరువులతో సాగు చేసిన పంటల్లో ఎన్నో పోషకాలు ఉండేవని, దీంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారన్నారు.
హరిత విప్లవం ద్వారా పంటలు అధిక దిగుబడులను సాధించేందుకు మితిమీరిన రసాయన ఎరువులను వినియోగించడంతో ప్రజలు, జంతువులు అనేక రోగాల బారిన పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పాతపంటలను పరిరక్షణతోపాటు వాటి సాగును మరింత పెంచేందుకు డీడీఎస్ మహిళా సం ఘాల కృషిని అభినందించారు. బసంతపూర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధ కేంద్రం, చెరుకు విభాగం రాష్ట్ర ప్రధాన శాస్త్రవేత్త డా.విజయ్‌కుమార్ వ్యవసాయం సుభీక్షంగా ఉన్నప్పుడే అందరూ సంతోషంగా ఉంటారన్నారు. పచ్చిరొట్ట్ట, సేంద్రియ ఎరువులను వాడడం వల్ల భూమి సారవంతంగా మారుతుందన్నారు.
పాత పంటలతో వండే వంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. రాష్ట్ర రైతు స్వరాజ్ వేదిక, మహిళా హక్కుల సామాజిక కార్యకర్త ఉషాసీతాలక్ష్మి మాట్లాడుతూ.. రైతులంటే ఎప్పటికీ ముఖ్యంగా మగవాళ్లే రైతులు అనుకునేవారమన్నారు. వ్యవసాయంలో మహిళల పాత్ర ఉందనేది డీడీఎస్ మహిళా సంఘాల కృషితో తెలిసిందన్నారు. ప్రభుత్వ విధానాలు, రైతుల అవసరాల దృష్ట్యా రాను న్న రోజుల్లో భూములు తమ చేతిలో లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. పాత పంటల పరిరక్షణతో పాటు భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఆనంతరం జీవవైవిధ్య సంరక్షణకు కృషి చేస్తున్న మహిళా రైతులైన శోభమ్మ, నర్సమ్మ, లచ్చమ్మ, అనిషమ్మ, రత్నమ్మలను ఘనంగా సన్మానం చేసి బహుమతులు అందజేశారు.
అనంత రం హార్వెస్ట్, హెవెన్-సీడ్స్ ఆఫ్ డైవర్సిటీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చిరుధాన్యాలతో అలంకరించిన ఎడ్ల బండ్ల ఊరేగింపును ఐసీఏఆర్ డైరెక్టర్ అటారి జోన్-10 డా. షేక్ ఎన్.మీరా ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఎడ్ల బండ్ల ఊరేగింపు, డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు, రైతుల జానపద నృత్యాలు, ఆటపాటలతో సందడిగా మారింది. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రసాద్‌రావు, సీనియర్ జర్నలిస్టు పతంగి రాంబాబు, హైకోర్డు అడ్వకేట్ రవికుమార్, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, రైతు నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, డీడీఎస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ దివ్య వెలుగురి, జాయింట్ డైరెక్టర్ గిరిధార్బాబు, లైజన్ ఆఫీసర్ మాణిక్యం, జాతర కోఆర్డినేటర్లు విజయ్‌కుమార్, మంజుల, మహిళా సభ్యులు నర్సమ్మ, పూలమ్మ పాల్గొన్నారు.