హుస్నాబాద్, నవంబర్ 21: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు పింఛన్ పెంచాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ.. దివ్యాంగుల పింఛన్‌ను రెట్టింపు చేయడంతో పాటు అన్ని విధాలుగా ఆదుకుంటామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చడం లేదన్నారు.
అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, సబ్సిడీ కింద వాహనాలు అందజేయాలని, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు దీక్ష చేస్తామని హెచ్చరించారు. వీరికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్ సహా పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఆందోళనలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు గుగులోతు రాజేశ్వరి, పెండెల సమ్మయ్య, చిరబోయిన రమేశ్, కనగండ్ల వెంకటలక్ష్మీ, యాటపోలు వసంత, శనిగరం అపర్ణ, దివ్యాంగులు పాల్గొన్నారు.