సంగారెడ్డి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఇండ్ల నిర్మాణాలను హైడ్రా ద్వారా వేగంగా కూల్చివేస్తున్నది. హెచ్ఎండీఏ పరిధికి సంగారెడ్డి జిల్లా నుంచి ఎనిమిది మండలాలు వస్తాయి. ఈ ఎనిమిది మండలాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని మిగతా గ్రామాల్లోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల విషయంలో స్పష్టత లేదు. నీటిపారుదల, సర్వేశాఖలు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లు గతంలోనే ఖరారు చేశాయి. సర్వేశాఖ అధికారులు మార్కింగ్‌లు చేయడంతో రాళ్లను పాతినప్పటికీ కాలక్రమంలో అవి తొలిగిపోయాయి. దీంతో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు తెలియక కొంతమంది ఇండ్లు నిర్మించుకున్నారు. కొన్నిచోట్ల రియల్టర్లు సొమ్ము చేసుకునేందుకు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో వెంచర్లు వేశారు. హైడ్రా కూల్చివేతలతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు.
హెచ్ఏండీఏ పరిధిలోని పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఎక్కువగా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల అన్యాక్రాంతం అయ్యాయి. దీంతో నీటిపారుదల శాఖ ఈ రెండు నియోజకవర్గాల్లోని చెరువుల కబ్జాకు అడ్డుకట్టవేసేందుకు డిజిటల్ సర్వేచేసి ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఖరారు చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, డిజిటల్ మ్యాప్‌లు ఆన్లైన్లో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీ పరిధిలో పటాన్చెరులో 106, రామచంద్రాపురం 14, అమీన్పూర్ 37, గుమ్మడిదల 86, జిన్నారం144, సం గారెడ్డి 41, కంది 91, హత్నూర 147 చెరువులు ఉన్నా యి. మొత్తం ఎనిమిది మండలాల పరిధిలో మొత్తం 666 చెరువుల డిజిటల్ సర్వే, ఎఫ్టీల్ బఫర్జోన్ల ఖరారును జిల్లా యంత్రాంగం ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది.
మొత్తం 666 చెరువులకు 409 చెరువులకు సంబంధించి డిజిటల్ సర్వే పూర్తి అయ్యింది. ఇందులో 250 చెరువుల ప్రాథమిక నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాయి. 50కి పైగా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లు ఖరారు చేసి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ఆన్లైన్లో పొందుపర్చారు. కాగా, ఇంకా 600కుపైగా చెరువులకు సంబంధించి డిజిటల్ సర్వే పనులు పూర్తి చేసి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకా ఆరునెలలకు పైగా సమయంపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైడ్రా పేరుతో ఓవై పు ప్రభుత్వం హెచ్ఏండీఏ పరిధిలోని మండలాల్లో కూల్చివేతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న క్రమంలో చెరువుల డిజిటల్ సర్వే నత్తనడకన సాగుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల వివరాలు, డిజిటల్ మ్యాప్‌లు ఆన్లైన్లో అందుబాటులో ఉండే చెరువులు కబ్జాకు గురికాకుండా ఉండడంతో పాటు జనం అప్రమత్తమై ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ప్లాట్లు కొనుగోలు చేయడం, ఇం డ్లు నిర్మించుకోవడం నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి చెరువుల డిజిటల్ సర్వే పనులు వేగవంతం చేయాలని ఆదేశించినా ఫలితం కనిపించడం లేదు. జిల్లా కలెక్టర్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు మరింత ఒత్తిడి తీసుకువస్తే తప్పా చెరువుల డిజిటల్ సర్వే ప్రక్రియ వేగంగా పూర్త య్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఈఈ జైంభీమ్ వివరణ కోరగా.. సాధ్యమైనంత త్వరగా హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల డిజిటల్ సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా చెరువుల డిజిటల్ సర్వే పూర్తి చేసి ఆన్లైన్లో మ్యాప్‌లను అందుబాటులో ఉంచే ప్రక్రియ వేగవంతం చేయనున్నట్లు ఆయన చెప్పారు.