హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 31: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్లో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న వాహనాలు తరుచూ మొరాయిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ, తాగునీటి సరఫరా తదితర పనులకు 10 ఆటోలు, 6 ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. ఇందులో ప్రతినెలా ఒకటి రెండు ఆటోలు మరమ్మతుల పేరిట మూలన పడుతున్నాయి. దీంతో చెత్త సేకరణకు వాహనాలు లేక ఇబ్బందులు ఎదురువుతున్నాయి.
ప్రత్యామ్నాయ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఆర్థికంగా సైతం మున్సిపల్‌పై భారం పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. హుస్నాబాద్ పట్టణంలోని 17,20వ వార్డులకు సంబంధించి చెత్త ఆటో నెలరోజులుగా మూలనపడింది. స్థానికంగా రిపేరు కాకపోవడంతో కరీంనగర్‌కు తరలించి నెలరోజులు గడుస్తున్నా అందుబాటులోకి రాకపోవడంతో చెత్త సేకరణకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. చెత్త సేకరణకు ఉపమోగించే వాహనాలను కొనుగోలు చేసిన సమయంలో బరువు ఎక్కువగా మోసేందుకు పట్టీలు వేయాల్సి ఉంది.
కానీ, వాటిని వేయకపోవడంతో పాటు గుంతల రోడ్లపై వాహనాలు తిప్పుతుండడంతో మరమ్మతులు వస్తున్నాయి. మరమ్మతులు సక్రమంగా చేయించకపోవడంతో తరుచూ వాహనాలు రిపేరు షెడ్డుకు చేరుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతినెలా వేలాదిరూపాయల వరకు రిపేర్ల కోసం వెచ్చించాల్సి వస్తుండడంతో మున్సిపల్‌పై ఆర్థిక భారం పడుతున్నది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చెత్త వాహనాల నిర్వహణపై సరైన దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.