– సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 4: ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్ తదితర అంశాలపై మండలాల వారీగా తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు మండలాల్లో ధరణి దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. సరైన కారణాలు లేకుండా తిరస్కరించరాదన్నారు. తిరస్కరిస్తే అందుకు సంబంధించిన కారణం చూపాలన్నారు. ఆమోదించిన దరఖాస్తులకు స్పష్టంగా రిమార్క్ ఉండేలా చూడాలన్నారు.
పాస్‌బుక్ డేటా కరెక్షన్, సక్సెషన్, ముటేషన్, మిస్సింగ్ నెంబర్స్, కన్వెన్షన్ ఇంటిమేషన్, జీఎల్ఎంజీపీఎల్ఏ, ప్రొహిబిషన్ ప్రాపర్టీస్, కోర్టు కేసులు, నాలా పీపీబీ కేసులు, నాలా వితౌట్ పీపీబీ తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించి అన్నింటిని క్లియర్ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించమన్నారు. పెండింగ్ ఉంటే చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని కలెక్టర్ హెచ్చరించారు. ఈ నెలాఖరులోగా తమ మండలంలోని ధర ణి దరఖాస్తులను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఆయా విషయాల్లో రెవెన్యూ యాక్ట్ మేరకు పూర్తి అవగాహనతో పని చేయాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో రాధికా రమణి, రెవెన్యూ డివిజనల్ అధికారులు నగేశ్, రమేశ్‌బాబు, తహసీల్దార్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.