బెజ్జంకి, ఆగస్టు 1: ప్రభుత్వ దవాఖానలో సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్‌ను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో శుక్రవారం ఆమె ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఉదయం 10.15 గంటలు దాటినా వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో లేరు, కేవలం స్టాఫ్ నర్సు, అటెండర్ మాత్రమే విధుల్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్‌తో ఫోన్లో మాట్లాడి విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందుతుందని, రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసి యూరియా నిల్వలు, రికార్డులను పరిశీలించారు. రికార్డులు, నిల్వలో వ్యత్యాసం ఉండటంతో విచారణ చేయాలని ఏవోకు సూచించారు. ఆగ్రో కేంద్రంలో నోటీస్ బోర్డుపై సమాచారం సరిగ్గా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను ఆమె పరిశీలించి, పనులు వేగవంతంగా నిర్వహించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లకు మట్టిలేక ఇబ్బంది పడుతున్నామని, ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సీపీఐ నాయకుడు సంగెం మధు కోరగా తెచ్చుకోవాలని అక్రమాలకు పాల్పడితే సహించమన్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతిపై పలు సూచనలు చేశారు. గుండారం ఉన్నత పాఠశాలను సందర్శించగా సకాలంలో మధ్యాహ్న భోజనం వంట చేయపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం సకాలంలో వంట చేసి విద్యార్థులకు అందించాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీలాపూర్ ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులు కేటాయించాలని యువనాయకుడు శనగొండ శరత్ కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వగా, ఎస్టీమేషన్ వచ్చేలా చూడాలని తహసీల్దార్‌కు సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంఈవో మహతిలక్ష్మి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కొండపాక(కుకునూరుపల్లి), ఆగస్టు 1: భూ సమస్యల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని సమీకృత మండల కార్యాలయ సముదాయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి రెవెన్యూ సదస్సుల పెండింగ్ దరఖాస్తుల పక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ హక్కుల పరిరక్షణ కోసం భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. 273 ఇండ్లు మంజూరైతే 237 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని 100 శాతం గ్రౌండింగ్ కావాలని ఆదేశించారు. ఇల్లు కట్టుకోవడానికి సుముఖంగా లేనివారికి నోటిస్ ఇచ్చి పేరు తొలిగించి మరో లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.