మెదక్, జనవరి 23(నమస్తే తెలంగాణ): పోలీసుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా మీకోసం నేనున్నానని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. గురువారం మెదక్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్‌లో కవాతు ప్రాంగణం, సెల్యూట్ బేస్‌ను ఆయన ఆవిషరించారు. డీజీపీకి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. పోలీస్ కవాతులో పాల్గొన్న డీజీపీ గౌరవ వందన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసులు పనిచేస్తున్నట్లు తెలిపారు.
మెదక్ జిల్లాకు పరేడ్ గ్రౌండ్ రావడం శుభ సూచకం అన్నారు. పోలీసులు క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం అలవాటు చేసుకోవాలన్నారు. సరెండర్ లివుల బిల్లుల కోసం రూ.200 కోట్లు, ఆరోగ్య భద్రత కోసం రూ.75కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసిందన్నారు. అమీన్పూర్, రాయపోల్, చేగుంట, నార్సింగి మండల కేంద్రాల్లో కొత్త బిల్డింగుల మంజూ రు, ఇతర కొత్త మండల కేంద్రాల్లో పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నక్సల్స్ సమస్య, నారోటిక్ డ్రగ్స్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులు త్వరితగతిన ఛేదించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
సైబర్ క్రైమ్‌తో రూ.180 కోట్ల రికవరీ చేశామన్నారు. 13 నెలలుగా పోలీసుల మెడికల్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, యూనిఫామ్ సర్వీస్‌లో ఉండి వారి సమస్యలు చెప్పుకోలేక భయపడుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ తెలిపారు. మాసాయిపేట, నార్సింగి, హవేళీఘనపూర్ మండలాలకు కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.