మొక్కులు చెల్లించుకున్న 15 వేల మంది భక్తులు
భక్తులతో రద్దీగా ఆలయ పరిసరాలు
చేర్యాల, జూన్ 5 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం మల్లన్నా మమ్మేలు అంటూ మార్మోగింది. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టారు. మరికొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కొండ పైన ఉన్న ఎల్లమ్మకు మట్టి పాత్రలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందించారు.
‘మల్లన్న’ సీర మహా రుచి
మల్లన్న ఆలయంలో సీర ప్రసాదం అమ్మకం ప్రారంభం
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కోసం సీర ప్రసాదం తయారు ప్రారంభించారు. ఆదివారం ఆలయంలోని ప్రసాద విక్రయ కేంద్రంలో 100 గ్రాముల సీర ప్రసాదాన్ని రూ.20లకు విక్రయిస్తున్నారు. భక్తులు సీర ప్రసాదాన్ని కొని ఇష్టంగా తింటున్నారని ప్రసాదాల విక్రయ కేంద్రం ఇన్చార్జి వెంకట్చారి తెలిపారు. ఈ సందర్భంగా వెంకటచారి మాట్లాడుతూ… రెండు వారాల నుంచి మల్లన్న ఆలయంలో ప్రతి ఆదివారం 5 నుంచి 6 కిలోల సీర ప్రసాదం తయారు చేసి 100 గ్రాముల ప్రసాదాన్ని రూ.20లకు భక్తులకు విక్రయిస్తున్నామని తెలిపారు. సీర ప్రసాదం బాగుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.