చేర్యాల, మార్చి 12: కొమురెల్లి క్షేత్రం కిటకిటలాడింది. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎనిమిదో ఆదివారం మల్లన్న క్షేత్రానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మల్లన్న స్వామీ.. మమ్మేలు స్వామీ., కొమురెల్లి మల్లన్నా.. కోటి దండాలు… అంటూ స్వామి నామాన్ని స్తుతిస్తూ ముందుకు సాగడంతో మల్లన్న క్షేత్రం మార్మోగింది.
50వేల మంది భక్తుల రాక..
8వ ఆదివారం సందర్భంగా 50 వేల మందికిపైగా భక్తులు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ తెలిపారు. స్వామివారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయ నిర్వహణలో ఉన్న గదులు, ప్రైవేటు గదులు కిరాయికి తీసుకుని అందులో బస చేశారు. శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్రలేచి గదుల్లో పవిత్ర స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో 4 గంటలపాటు వేచి ఉన్నారు. ధర్మ దర్శనానికి రెండు గంటలు, శీఘ్ర దర్శనానికి మూడున్నర గంటలు, వీవీఐపీ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. స్వామివారి దర్శనం అనంతరం గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహా మండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకోవడంతోపాటు కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కొందరు భక్తులు స్వామివారికి ఒడిబియ్యం, అభిషేకం, అర్చన, బోనాలు తదితర పూజలు నిర్వహించారు.
దారులన్నీ మల్లన్న చెంతకే..
భారీగా భక్తులు వివిధ వాహనాలతో తరలిరావడంతో చేర్యాల నుంచి కొమురవెల్లికి వచ్చే రహదారిలో రెండు కిలోమీటర్లు, ఐనాపూర్ నుంచి కొమురవెల్లికి వచ్చే దారిలో కిలోమీటరున్నర, సిద్దిపేట నుంచి కొమురవెల్లికి వచ్చే దారిలో కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ సందర్భంగా భక్తులకు పాలక మండలి సభ్యులు నర్రా రఘువీరారెడ్డి, మర్పల్లి శ్రీనివాస్ గౌడ్, కొంగరి గిరిధర్, సూటిపల్లి బుచ్చిరెడ్డి, నామిరెడ్డి సౌజన్య రెడ్డి, కాసర్ల కనకరాజు, చెట్కూరి తిరుపతి, కందుకూరి సిద్దిలింగం, పచ్చిమడ్ల సిద్దిరాములు, మహేశ్ యాదవ్, సాయి యాదవ్, ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, పర్యవేక్షకులు నీల శేఖర్, శ్రీనివాస్‌శర్మ, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు తదితరులు సేవలందించారు.
అన్నదాన సత్రానికి 50 వేల విరాళం..
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో కొనసాగుతున్న అన్న ప్రసాద వితరణశాలకు చేర్యాల పట్టణానికి చెందిన అల్లం నాగరాజు-మమత దంపతులు రూ.50 వేల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ విరాళం అందజేసిన దాత నాగరాజును శాలువాతో సన్మానించి, స్వామివారి ప్రసాదం అందించారు. అడిషన్ డీసీపీ మహేందర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు చంద్రమోహన్, భాస్కర్‌రెడ్డి, నారాయణ తదితరులు బందోబస్తు నిర్వహించారు.