మెదక్ రూరల్, ఏప్రిల్ 30: గరుడ గంగా పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. మెదక్ మండలం పేరూరు సమీపంలో ఉత్తర వాహినీగా ప్రవహిస్తున్న ఈ నదీ తీరంలో వేకువ జామునుంచే స్నానాలు ఆచరిస్తున్నారు. తొమ్మిదో రోజు భక్తులతో కళకళలాడింది. ఆదివారం సెలువు రోజు కావడంతో వివిధ జిల్లాలు , రాష్ట్రల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుణ్యస్నానాలు చేసిన భక్తులు గరుడగంగ సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు నాగుల విభూతిని ధరిస్తూ సరస్వతీ మాత, నాగదేవతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గరుడగంగా పుష్కరాల్లో జూనియర్ సివిల్ జడ్జి రీటాలాల్చంద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మంజునాథుడికి అభిషేకం చేసి, సరస్వతీమాతను దర్శించుకున్నారు. మహిళాభక్తులు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలో గుణకార్శర్మ, మహేశ్‌శర్మ, చిలుకూరి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.