సిద్దిపేట, సెప్టెంబర్ 15: కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిపై కక్ష కట్టింది. కొత్త పనుల మాట దేవుడెరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు ఆపేయడంతో పనుల పరిస్థితి “ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి” అన్న చందంగా తయారైంది.పేదలకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వేయి పడగల దవాఖాన ప్రజలకు కలగానే మిగిలింది.
మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట ఎన్సాన్‌పల్లిలోని మెడికల్ కళాశాలకు అనుబంధంగా రూ.266 కోట్లతో 1000 పడకల దవాఖాన మంజూరు చేశారు. 75శాతం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం దవాఖాన పనులను పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 పడకల దవాఖాన నిర్మాణ పనులను ఆపేసింది. దవాఖాన భవనం అందుబాటులోకి రాకపోవడంతో పాటు మౌలిక వసతులు లేక సిబ్బందిని నియమించలేదు. దీంతో ప్రజలకు సరైన వైద్య సేవలు అందక హైదరాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
దవాఖాన నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 324 కోట్లతో జీప్లస్ 5 పద్ధతిలో భవన నిర్మాణంతోపాటు మెడికల్ కళాశాలకోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. అప్పటి ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి దవాఖాన నిర్మాణాన్ని 75 శాతం పూర్తి చేయించారు. ఒకే చోట ఐదు అంతస్తులో అధునాతన వైద్య సేవలతో దవాఖానను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేశారు.
ఫలితంగా 2023 అక్టోబర్‌లో దవాఖానలో మొదటగా గ్రౌండ్ ఫ్లోర్లో డెంటల్ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చి వేయి పడకల దవాఖానను హరీశ్‌రావు ప్రారంభించారు.25 శాతం పనులు పూర్తి చేస్తే పేదలకు దవాఖాన అందుబాటులోకి రానుంది. ఈ విషయంపై ఎమ్మెల్యే హరీశ్‌రావు గత నెలలో జరిగిన జిల్లా ఆభివృద్ధి సమీక్షా సమావేశంలో నిధులు మంజూరు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని అడిగితే ఇంతచిన్న సిద్దిపేటకు అంత పెద్ద దవాఖాన ఎందుకు అంటూ మాట్లాడటం సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్ కక్షపూరిత వైఖరికి నిదర్శనంగా చెప్పవచ్చు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు అంతస్తుల్లో పనులు పూర్తిచేసి గ్రౌండ్ ఫ్లోర్లో డెంటల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంతస్తులో ఓపీడీతోపాటు సాధారణ శస్త్ర చికిత్స, ఆర్థోపెడిక్ ఓపీడీ, రక్త పరీక్షల శాంపిల్ సేకరణ విభాగం, ఫార్మసీ విభాగాలను ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులు ఈఎన్టీ, ఓపీడీ డయాలసిస్, క్యాత్ లాబ్, రెండో అంతస్తులో క్షయ, ఛాతివిభాగం, డివియల్ వార్డు, జనరల్ వార్డులు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి మెడికల్ పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దవాఖానకు నిధులు మంజూరు చేయకపోవడం, పూర్తిస్థాయిలో జీజీహెచ్ నుంచి వెయ్యి పడకలకు దవాఖానను మార్చకపోవడం, ఒక విభాగం తప్పా మిగతా అన్ని విభాగాలు జీజీహెచ్‌లో ఉండడంతో డెంటల్ విభాగాన్ని సైతం ప్రభుత్వ జనరల్ దవాఖానకు మూడు నెలల క్రితం తరలించారు. మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం, సిబ్బందిని నియమించలేదు. సెక్యూరిటీ, శానిటైజేషన్ విభాగం సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
బడ్జెట్ కూడా ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో దవాఖానను జీజీహెచ్‌కు తరలించి 1000 పడకల దవాఖానకు తాళం వేశారు. వందల కోట్లతో నిర్మించిన దవాఖానను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో నిరుపయోగంగా మారింది. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న అప్పటి ప్రభు త్వ కలవేరకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు వేయి పడకల దవాఖానను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సిద్దిపేట ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
త్వరలో పనులు ప్రారంభం
సిద్దిపేటలో 1000 పడకల దవాఖాన పనులను త్వరలో ప్రారంభిస్తాం. త్వరగా భవనం ప్రజలకు అం దుబాటులోకి తీసుకువస్తాం. ఆగస్టులో ప్రభుత్వం రూ.13కోట్లు మంజూరు చేసింది. ఎక్కడ కూడా బిల్లు లు పెడింగ్‌లో లేవు. – రవీందర్, ఈఈ, ఉమ్మడి జిల్లా