జహీరాబాద్/ఝరాసంగం, జనవరి 13: గిరిజనుల ఆరాధ్యదైవమైన మోతీమాత ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్‌పల్లి తండాలో నిర్వహిస్తున్న మోతీమాత జాతరకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలు, పూర్ణకుంభంతో పుజారులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. హరీశ్‌రావు ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన, హారతి, యాగశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోతీమాత జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తుల ఇలవేల్పుగా మారిన మోతీమాతను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుంటారన్నారు.
కేసీఆర్ ఆశీస్సులతో ఆలయాభివృద్ధికి కృషి చేశామని, మోతీమాత జాతరకు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం కమ్యూనిటీ హాల్, తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలను కల్పించామని చెప్పారు. ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఒక్క హామీని నేరవేర్చలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలోనే 10శాతం రిజర్వేషన్ కల్పించి విద్య, ఉద్యోగాల్లో అవకాశం కల్పించామని చెప్పారు. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన గిరిజన విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిపులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం సరికాదన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చెల్లించిన మాదిరిగానే విద్యార్థులకు వెంటనే ఓవర్సీస్ స్కాలర్‌షిపులు చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మహిళలకు కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకారం గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించేలా చర్యల తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మోతీమాత జాతరకు వచ్చిన మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీజైపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ నరోత్తం, జహీరాబాద్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, నర్సింహులు, సంజీవ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మచ్చేందర్, పార్టీ నాయకులు నామ రవికిరణ్, పెంటారెడ్డి, గుండప్ప, విజయ్‌కుమార్, హీరురాథోడ్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.