రాయపోల్, జూలై 04 : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ హైమద్ నగర్ పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం తిరుమలాపూర్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలు అర్థం కాకపోతే తిరిగి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు భయపడకుండా చదువులో మంచిగా రాణించాలని ఆకాంక్షించారు.
పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణను కూడా నేర్పించాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేస్తేనే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటినుంచే బాగా కష్టపడి శ్రద్ధగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని సూచించారు. అదేవిధంగా ఉన్నత పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనుపై ఆరా తీశారు. తప్పకుండా మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పకుండా సమయపాలన పాటించాలని అదేవిధంగా 15 సంవత్సరాలు దాటిన యువకులకు, వయోజనులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్యను అభ్యసించే అవకాశం ఉందని గ్రామంలోని యువకులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి మండలంలోని కూడా ప్రతి గ్రామపంచాయతీలో ఉల్లాస్ ద్వారా అభ్యాసకుల వివరాలు పొందుపరచాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముత్యంరెడ్డి, ప్రశాంత్, స్వాతి సౌజన్య అదేవిధంగా సి.ర్.పి లు నగేష్, కుమార్, రాజు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.