మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 1: ఉమ్మడి మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వర పీడితులతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఓపీ కేసులతో పాటు ఔట్ పేషెంట్ కేసులు బాగా నమోదవుతున్నాయి. పల్లె, పట్టణం అని తేడాలేకుండా ప్రజలు వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. డెంగీ, మలేరియా, టైపాయిడ్, డయేరియా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. తాగునీరు కలుషితం కావడం, దోమలు వృద్ధి చెందడం, పారిశుధ్యం పడకేయడం, తదితర వాటితో జనం జబ్బుల బారినపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో అధికారికంగా 70 డెంగీ కేసులు నమోదు కాగా, అధికారుల దృష్టికి రాని ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. టైఫాయిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా లో 1415 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు తక్కువగానే కురిసినప్పటికీ పారిశుధ్యం పడకేయడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో జ్వరం కేసులు పెరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ క్రియాశీలకంగా వ్యవహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో డెంగీ, టైఫాయిడ్, మలేరి యా వంటి కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణ సక్రమంగా చేపట్టక పోవడం, మున్సిపాలిటీల్లో రోడ్లపైనే చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమల బెడద పెరిగిందని ప్రజలు వాపోతున్నారు. జ్వరం వస్తే భయంతో దవాఖానలకు పరుగులు తీస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానకు రోగుల సంఖ్య బాగా పెరిగింది. ఓ వైపు జ్వరాలతో దవాఖానలో చేరితే మరోవైపు ఔట్ పేషెంట్ విభాగంలోనూ రోగుల సంఖ్య ఎక్కువైంది. ఇటీవల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించి జిల్లాలో డెంగీ కేసుల పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సీజనల్ వ్యాధులు నమోదైతే సంబంధిత అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని అధికారులను ఆమె ఆదేశించారు.
సిద్దిపేట జిల్లాలో జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు 25 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఒక మ లేరియా కేసు నమోదైంది. డెంగీ బారినపడి వివిధ దవాఖానల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. దోమకాటు కారణంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో జూలై నెలలోనే 31,60 ఔట్ పేషెంట్ రికార్డు నమోదైంది. 2306 మంది ఇన్పేషెంట్లుగా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. విష జ్వరాలతో 59 మంది , డెంగీతో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 137 మంది జ్వరంతో, 17 మంది డయేరియాతో, 12 మంది దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
మెదక్ జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే వైరల్ ఫీవర్ బారిన పడుతున్నాయి. డెంగీ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇటీవల చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన నిఖిల్ అనే యువకుడు డెంగీతో మృతిచెందాడు. రామాయంపేట మండలం సుతార్పల్లిలో చికున్ గున్యాతో అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ 160 మందికి రక్త పరీక్షలు చేయగా, అందులో ఒకరికి డెంగీ, ముగ్గురికి టైఫాయిడ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 8 డెంగీ, 12 టైఫాయిడ్ కేసులు, 654 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ఇవేకాక మరో 8 వరకు డెంగీ కేసులు ప్రైవేట్ దవాఖానల్లో నమోదైనట్టు తెలిసింది. పారిశుధ్యం నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా కేసులతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలతో జిల్లాలోని దవాఖానల్లో ఓపీ కేసుల సంఖ్య పెరిగింది. మెదక్ ప్రభుత్వ దవాఖాన సీజనల్ వ్యాధుల చికిత్స కోసం వస్తున్న వారే ఎకువ ఉన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, ప్రైవేటు దవాఖానల్లో కూడా ఓపీ సంఖ్య పెరుగుతోంది.మెదక్ జిల్లాకేంద్ర దవాఖానలో నిత్యం 500 మందికి ఓపీ వచ్చే వారు. ఇప్పుడు దాదాపు 600 వరకు పెరిగిందని దవాఖాన వర్గాలు తెలిపాయి.
జిల్లాలో సీజనల్ వ్యాధులు నియంత్రణలోనే ఉన్నాయి. బుధవారం జిల్లాలో 67 డెంగీ కేసులు ఉండగా, గురువారానికి మరో 3 కేసులు పెరిగి 70 కేసులు నమోదయ్యాయి. ఇందులో 22 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. టైఫాయిడ్ కేసులు 1415 ఉండ గా, చికెన్ గున్యా, మలేరియా జ్వరానికి సంబంధించిన కేసులు జిల్లాలో నమోదు కాలేదు. జిల్లాలో అంటువ్యాధులను అరికట్టేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జూలై 8 నుంచి ఇంటింటికీ వెళ్లి జ్వరం సర్వే నిర్వహిస్తున్నాం. డ్రై డే పాటిస్తున్నాం. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దోమల నివారణ కోసం జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
– డాక్టర్ గాయత్రీదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సంగారెడ్డి
డెంగీ జ్వరాన్ని దరి చేయనీయకుండా పరిసరాలను పశుభ్రంగా ఉంచాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వారం దాటి నీరు నిల్వ ఉన్నచోట లార్వా అభివృద్ధి చెందడంతోనే డెంగీ జ్వరానికి కారణమయ్యే ఈడీఎస్ దోమ వ్యాప్తి చెందుతుందని, ఈడీస్ దోమ పగటిపూట కుట్టడం ద్వారా డెంగీ వచ్చిన వారితో ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందుతున్నదని తెలిపారు. ఇంట్లోని రిఫ్రిజిరేటర్ల బ్యాక్ వాటర్, కుళాయిలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వాడి పడేసిన టైర్లు, కొబ్బరి చిప్పల వాటిలో నీరు నిల్వ ఉంటే వాటిని తొలిగించాలి. ఎలాంటి పాత్రలో అయినా వారం రోజులు మించి నీరు నిల్వ ఉంటే అక్కడ లార్వా అభివృద్ధి చెందకుండా కిరోసిన్ చుక్కలు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తున్నది. ప్రజలు శుభ్రమైన నీటినే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. కొన్ని గ్రామాల్లో పైప్‌లు పగిలిపోయి తాగునీరు కలుషితమై డయేరియా ప్రబలుతోంది. పల్లెల్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో క్లోరినేషన్ సరిగ్గా చేయడం లేదు. పర్యవేక్షణ చేయాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా దోమల నివారణ కోసం బ్లీచింగ్ చల్లడం, ఫాగింగ్ వంటివి చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకాధికారుల పాలన, నిధుల లేమితో పంచాయతీల్లో పాలన పడకేసింది.
పది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న. ఊరిలో ఆర్ఎంపీ దగ్గర చికిత్స తీసుకున్నా. కానీ, తగ్గలేదు. మూడు రోజు ల క్రితం సిద్దిపేట జనరల్ దవాఖానకు వచ్చి చూపించుకుంటే అడ్మిట్ కావాలని చెప్పారు. రెండు రోజుల నుంచి సె లైన్ పెడుతున్నారు. మందులు ఇస్తున్నారు. ఇంకా పూర్తిగా జ్వరం తగ్గలేదు.
-సాయికిరణ్, ఖాజీపూర్(సిద్దిపేట జిల్లా)
పది రోజుల నుంచి విపరీతంగా జ్వరం వస్తున్నది. గ్రామం లో ఆర్ఎంపీ దగ్గర చూపించుకున్నా. జ్వ రం తకువ కాలేదు. దుబ్బాకలో ప్రైవేట్ దవాఖానలో టెస్టులు చేయించుకున్నా. రక్తకణాలు తగ్గాయని చెప్పారు. మంచి వైద్యం కోసం ఇకడికి రెఫర్ చేశారు. నాలుగు రోజులు అవుతుంది వచ్చి. సిద్దిపేట దవాఖానలో చికి త్స పొందుతున్న. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న.
– స్రవంతి, చెల్లాపూర్ (సిద్దిపేట జిల్లా)
15 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న. కోహెడలో డాక్టర్లకు చూపించుకున్న. కానీ, తకు వ కాలేదు. ఏఎన్ఎం, వైద్య సిబ్బం ది మా ఇంటికి వచ్చి గోలీలు ఇచ్చిండ్రు. అయినా తకువ కాలే దు, సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో మూడు రోజుల క్రితం వచ్చి చూపించుకున్న. టెస్ట్‌లు చేసి టైఫాయిడ్ అని వైద్యులు చెప్పా రు. రెండు రోజుల నుంచి గ్లూకోజ్‌లు పెట్టారు.
– చిలుకవ్వ, తంగెళ్లపల్లి, కోహెడ మండలం(సిద్దిపేట జిల్లా)