శివ్వంపేట, జూన్ 2 : శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లి గ్రామ శివారులోని అక్రమంగా నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. వివరాలలోకి వెళితే దాదాపు 15ఏళ్లుగా నక్షబాటను కబ్జాకు గురైందని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం తహశీల్దార్ కమలాద్రి ఆధ్వర్యంలో సర్వే చేసి నక్షబాటను పునరుద్ధరించారు. అయితే, నక్షబాటను పునరుద్ధరించేందుకు వెళ్లిన తహశీల్దార్ కమలాద్రి కారును కాంగ్రెస్ నాయకుడు ఏర్పాటు చేసిన వృంధా వెంచర్ నిర్వహకులు దాదాపు రెండు గంటలు ట్రాక్టర్ అడ్డుగా పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన తహశీల్దార్ నిర్వహకులను హెచ్చరించడంతో అడ్డుతగలిలారు. కాంగ్రెస్ నాయకుడు నిర్మించిన వృంధా వెంచర్ ప్రధాన గేటు, ప్రహరిగోడ నక్షబాటలో ఉండడంతో జేసీబీతో వాటిని అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొంతాన్‌పల్లిలో ఆక్రమణకు గురైన నక్షబాటను పునరుద్దరించడం జరిగిందన్నారు.
నక్షబాటలకు అడ్డగా ఉన్న అక్రమ కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చివేశామన్నారు. మండలంలో ఎవరైనా అక్రమంగా భూములు కబ్జా చేస్తే వారిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పలువురు బాధితులు మాట్లాడుతూ తమకు 30సంవత్సరాల క్రితం మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి హయాంలో నిరుపేదలమైన తమకు సీలింగ్ పట్టా సర్టిఫికెట్లు అందజేసింది. 338, 339 సర్వేనంబర్లలో దాదాపు 27 ఎకరాలు పంపిణీ చేయగా 12 ఎకరాల వరకు గ్రామానికి చెందిన తమ గ్రామ కాంగ్రెస్ నాయకుడు, పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకటరాంరెడ్డి కబ్జా చేశాడని ఆరోపించారు. అదేవిధంగా నక్షబాట, గ్రామ కరీంకుంటను కబ్జా చేసి వెంచర్లో విలీనం చేసుకున్నాడన్నారు. అధికారులు స్పందించి కబ్జాకు గురైన తమ భూములను సర్వే చేసి తమకు అప్పగించాలని భూ బాధితులు కోరుతున్నారు. కార్యక్రమంలో బాధితులు దేవలింగం, కుమ్మరి మహేశ్, జంగరాయి సత్యమ్మ, కుల్ల నర్సయ్య, బొగ్గుల కాశప్ప, పంబళ్ల కృష్ణ, జంగం యాదమ్మ, బేగరి లక్ష్మి, బేగరి సాయిలు, బేగరి నర్సయ్య ఉన్నారు.