బొల్లారం, నవంబర్ 17: మొబైల్లో గేమ్స్ ఆడుతున్న కూతురు నుంచి ఫోన్ లాక్కొవడంతో ఆమె మనస్తాపానికి గురైన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పీఎస్ పరిధిలోని వినాయక నగర్లో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ర్టానికి చెందిన మనుసింగ్ కొంతకాలంగా బొల్లారంలోని వినాయకనగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చిన్న కూతురు జియా కుమారి(14) ఎనిమిదో తరగతి చదువున్నది.
ఈనెల 15వ తేదీ రాత్రి మనుసింగ్ భార్య పింకిదేవి ఇంట్లో పనిచేస్తుండగా అదే సమయంలో జియాకుమారి ఫోన్లో గేమ్స్ ఆడుతోంది. పనికి సహాయం చేయాలని తల్లి కూతురు చేతిలోనిఫోన్ను తీసుకొని పక్కన పెట్టింది. దీంతో కూతురు జియాకుమారి బెడ్రూంలోకి వెళ్లి డోర్ వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత పింకిదేవి గదిలోంచి బయటకు రావాలని పిలిచినా కూతురు రాలేదు. పెద్ద కూతురు అనామిక గది వెనుక వైపు ఉన్న కిటికీ నుంచి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. వెంటనే తండ్రి మనుసింగ్ జియాకుమారిని కిందికి దింపి సమీపంలో ఉన్న దవాఖానకు, ఆ తర్వాత మెరుగైన వైద్య కోసం మరో దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది. ఆదివారం మృతురాలి తండ్రి మనుసింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.