సిద్దిపేట/గజ్వేల్, అక్టోబర్ 5: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి తప్పులు లేకుండా సమాచారం సేకరించాలని రాష్ట్ర రోడ్డు భవవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన సూచించారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని 34వ వార్డులో కలెక్టర్ మనుచౌదరితో కలిసి అధికారులు నిర్వహిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్వే చేస్తున్నప్పుడు కుదిరితేనే కుటుంబ సభ్యుల గ్రూపు ఫొటోలు తీసుకోవాలన్నారు. సర్వేను వేగంగా, పారదర్శకంగా పూర్తిచేయాలన్నారు. అనంతరం హోటల్ మినర్వాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని సీఎంవో జాయింట్ సెక్రటరీ సంగీత అధికారులకు సూ చించారు. శనివారం గజ్వేల్ మున్సిపల్లోని 17 వార్డులో చేపడుతున్న సర్వేను కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. సర్వేలో ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండాలన్నారు. ఏ ఒక్క ఇంటిని మర్చిపోకుండా సర్వే చేయాలన్నారు. ఈ సర్వే 8వ తేదీ వరకు కొనసాగుతుందని, ఇప్పటివరకు 80శాతం పూర్తయిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో బన్సీలాల్, తహసీల్దార్ శ్రవణ్, కమిషనర్ నర్సయ్య, ఆర్ఐ కృష్ణ పాల్గొన్నారు.