అందోల్, ఏప్రిల్ 18: చదువు, విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని… అందు లో భాగంగానే అందోల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నానని రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంతో పాటు అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో శనివారం ఆయన రూ. 27.76 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. నియోజవర్గంలో ఇప్పటికే జేఎన్టీయూ, పాలిటెక్నిక్, ఫార్మసీ, నర్సింగ్, వ్యవసాయ కళాశాలలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ నాణ్యమైన ఉన్నత విద్య అందిస్తున్నామన్నారు. అంతకు ముందు రూ. 1.80 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి రూ. 5కోట్లతో నిర్మించనున్న పర్యాటక రెస్టారెంట్, రూ. 20 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలకు శంకుస్థాపనలు చేశారు.
రూ. 53 లక్షలతో నిర్మించిన గ్రంథాలయం మొదటి అంతస్తును ప్రారంభించారు. కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ పాండు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ట్రాన్స్‌కో ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ సాగర్మధుకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.