మద్దూరు(ధూళిమిట్ట), జూలై 27: రోజురోజుకు సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఓ ఆటో డ్రైవర్‌నూ సైబర్ మోసగాళ్లు విడిచిపెట్టడం లేదు. ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్‌ను సైబర్ మోసగాడు హ్యాక్ చేసి, నీవు తీసుకున్న రుణం చెల్లిస్తావా.. లేదంటే నీతో పాటు నీ కుటుంబ సభ్యుల న్యూడ్ ఫొటోలు నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్లకు పంపించమంటావా.. అంటూ వేధింపులకు పాల్పడిన సంఘటన ఆదివారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన జంగిటి శ్రీనివాస్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం తన వాట్సాప్ నెంబర్‌కు +923147544545 అనే నెంబర్‌తో నీవు తీసుకున్న రూ. 2500 రుణం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ మెసేజ్‌ను చదివిన శ్రీనివాస్ తాను ఎలాంటి రుణం తీసుకోకపోయినా తనకు ఈ మెసేజ్‌ను ఎందుకు పంపించారని తిరిగి సదరు నెంబర్‌కు మెసేజ్ పంపాడు.
దీంతో రెచ్చిపోయిన హ్యాకర్ బూతులు తిట్టుకుంటూ డబ్బులు పంపిస్తావా లేదా.. లేకపోతే నీతో పాటు నీ కుటుంబ సభ్యుల ఫొటోలను న్యూడ్‌గా నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్లతో పాటు అన్ని వెబ్సైట్లలో పెడుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనికితోడు శ్రీనివాస్ ఫోన్లో ఉన్న సమాచారం, ఫొటోలను హ్యాకర్ తిరిగి శ్రీనివాస్ వాట్సాప్‌కు పంపిస్తుండడంతో తన ఫోన్ నెంబర్ హ్యాక్ అయినట్లు గుర్తించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.