సంగారెడ్డి డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల ఎదుట ప్రతిరోజూ రద్దీ కనిపిస్తున్నది. ఈకేవీసీ చేయించుకునేందుకు గ్యాస్ వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులుతీరుతున్నారు. ముఖ్యంగా మహిళలు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం తెరవకముందే వేకువజాము నుంచి క్యూకడుతున్నారు. ఈకేవైసీ చేయటంలో గ్యాస్ ఏజెన్సీలు తాత్సారం చేస్తుంటడంతో వినియోగదారులు గంటల తరబడి వరుసలో నిల్చుని ఇబ్బందులు పడాల్సివస్తోంది. పదిరోజులుగా సంగారెడ్డి జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల ఎదుట వినియోగదారులు బారులుతీరుతుండటంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో రాయితీ గ్యాస్ పథకం అమలవుతుందని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు అనుకుంటున్నారు. గ్యాస్ రాయితీ వర్తించాలంటే ఈకేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) తప్పనిసరి భావించి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల ఎదుట ఈకేవైసీ చేయించుకునేందుకు వినియోగదారులు క్యూకడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు వేగంగా స్పందించి ఈకేవీసీలు పూర్తి చేయటంలేదు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని పట్టణాల్లో గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు టోకెన్లు ఇచ్చి తాము సూచించిన తేదీరోజూ ఈకేవైసీ కోసం రావాలని సూచిస్తున్నారు. దీంతో గ్యాస్ ఏజెన్సీల తీరుపై వినియోగదారులు మండిపడుతున్నారు.
ఈకేవైసీ చేయటంతో ఏజెన్సీల తాత్సారం
సంగారెడ్డి జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు ఈకేవీసీ చేయటంలో తాత్సారం చేస్తుండడంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో భారత్ గ్యాస్, హెచ్‌పీ(హిందుస్తాన్ పెట్రోలియం), ఐఓసీ(ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్)కు చెందిన 35 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 35 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో మొత్తం 5,66,858 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సింగిల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు 1,81,458, డబుల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు 1,76,644 ఉన్నాయి. అలాగే దీపం పథకం గ్యాస్ కనెక్షన్లు 88563, ప్రధాన మంత్రి ఉజ్వల కనెక్షన్లు 48,017, సీఎస్ఆర్ కనెక్షన్లు 72,176 ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీలు ప్రతిఏటా వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తాయి. మూడు మాసాల క్రితం గ్యాస్ ఏజెన్సీలు ఈకేవైసీ చేయించుకోవాలని వినియోగదారులను కోరాయి. అయితే వినియోగదారులు అప్పుడు పెద్దగా స్పందించ లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించడంతో వినియోగదారులు ప్రస్తుతం ఈకేవైసీ చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల ఎదుట బారులుతీరుతున్నారు.
ఈకేవైసీ చేయించుకోవాలంటే గ్యాస్కనెక్షన్ ఉన్న వినియోగదారులు స్వయంగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఆధార్‌కార్డు ఇవ్వటంతోపాటు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. దీంతో గ్యాస్ వినియోగదారు జిల్లాలోని 35 గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల ఎదుట వేకువజాము నుంచే బారులుతీరుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు సరైన సమాచారం ఇవ్వకపోటం, వేగంగా ఈకేవైసీలు పూర్తిచేయక పోవటంతో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ రాయితీ పథకాన్ని అమలుపై ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటించ లేదు. అలాగే ఈకేవైసీ తప్పనిసరి అని చెప్పలేదు.ఈ విషయాన్ని గ్యాస్ ఏజెన్సీలు కానీ, పౌర సరఫరాల శాఖ అధికారులు కానీ వినియోగదారులకు చెప్పటం లేదు. గ్యాస్ రాయితీ పథకం పొందాలంటే ఈకేవైసీ తప్పసరి అని భావించి వినియోగదారులు పెద్దసంఖ్యలో బారులుతీరుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వినియోగదారులు పట్టణాల్లోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు వేగంగా ఈకేవైసీలు పూర్తిచేయకపోవటంతో క్యూలైన్లో ఉన్న మహిళలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈకేవైసీ కోసం ఆందోళన అవసరం లేదు
ప్రభుత్వం గ్యాస్ రాయితీ పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని, వినియోగదారులు అనవసరంగా ఆందోళన చెంది గ్యాస్ ఏజెన్సీల ఎదుట క్యూకట్టవద్దని జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాత తెలిపారు. వినియోగదారులు ఆన్లైన్లో లేదా ఇంటి వద్దకు వచ్చే గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది ఫోన్లో ఈకేవైసీ చేయించుకోవచ్చని తెలిపారు. ఈకేవైసీ సమర్పించేందుకు గ్యాస్ కంపెనీలు ఎలాంటి తుదిగడువు విధించలేదన్నారు. గ్యాస్ వినియోగదారులు అనవసరంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇబ్బందులు పడవద్దని సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు ఈకేవైసీ కోసం వచ్చే వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా వేగంగా ఈకేవైసీ పూర్తి చేసి పంపించాలని సూచించారు.
ఎవరికీ అవగాహన లేదు..
దరఖాస్తు ఫారం నింపేటప్పుడు సందేహాలుంటే అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. ఈ విషయంలో ఎవరికీ పూర్తి అవగాహన లేదు. ఆరు గ్యారంటీల్లో ఏ పథకం ఎవరికి వర్తిస్తుందో తెలియదు. ఈ గందరగోళ పరిస్థితి చూస్తుంటే మాకు అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తున్నది.ట్లే
– చేపూరి స్వామి, లక్ష్మాపూర్ (మెదక్ జిల్లా)
దరఖాస్తు ఫారాలు అందుతలేవు..
అభయహస్తం దరఖాస్తు ఫారాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. ఒకలకు ఇచ్చిన దాన్ని జిరాక్స్ తీసుకోవాలని అధికారులు చెప్పుతున్నరు. అది సరైంది కాదు. ప్రజాపాలనలో ప్రభుత్వం అనుకున్నంత అధికారులు జేస్తలేరు. దరఖాస్తులు నింపరానోళ్లు బతిమిలాడినా పట్టించుకుంటలేరు. తెల్వనోళ్లకు అధికారులు ఫారాలు నింపించియ్యాలే. ఫారంలో ఉన్నవి అర్థమయ్యేట్ల చెప్పాలే. – పత్తి రాజేందర్, రైతు, చెప్యాల, మిరుదొడ్డి (సిద్దిపేట జిల్లా)
ప్రజాపాలనపై ప్రజలకు అవగాహన లేదు..
ప్రజాపాలనలో ఐదు గ్యారంటీలపై ప్రజలకు దరఖాస్తు ఎలా నింపాలో తెలియడం లేదు. కొంతమందికి రేషన్ కార్డు లేదు, దరఖాస్తు ఫారంతో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్ జత చేయుమంటున్నారు. రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఆందోళనగా ఉంది. రేషన్‌కార్డు లేనివారికి ఈ గ్యారంటీలు వస్తాయా.. రావా అనేది అధికారులు చెప్పడం లేదు. ప్రజాపాలన అస్తవ్యస్తంగా ఉంది. కుటుంబంలో కొంతమందికి రేషన్ కార్డులో పేర్లు లేవు. దీనిపై అధికారుల నుంచి స్పష్టత లేదు.
– ఫయాజ్ షరీఫ్, నల్లవల్లి, గుమ్మడిదల మండలం (సంగారెడ్డి జిల్లా)