రామాయంపేట/హుస్నాబాద్ టౌన్,అక్టోబర్ 6: నోరూరించే మధుర ఫలాలు రానే వచ్చేశాయి. సీతాఫలాల సీజన్ రావడంతో మార్కెట్లో జోరుగా విక్రయిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట గంపలు గంపలుగా విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో సీతాఫలాలు విరివిగా పండాయి. తండాలు, గ్రామాలకు చెందిన గిరిజనులు, ఇతర కూలీలు అటవీ ప్రాంతాలు, గ్రామ శివారు ప్రాంతాల్లోకి వెళ్లి సీతాఫలాలు తెంపి పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు.
ఒక్కో సీతాఫలం పది నుంచి ఇరవై ఐదురూపాయల వరకు ధర పలుకుతున్నాయి. పండ్ల బుట్ట వెయ్యిరూపాయల వరకు పలుకుతున్నది. సీతాఫలాల కాయల బుట్ట సైతం ఐదువందల నుంచి ఏడువందల రూపాయల దాక పలుకుతున్నది. అయినప్పటికీ మధురఫలాల్లో పోషకాలు ఉండటంతో జనం కొనుగోలు చేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలా ల్లో అటవీ ప్రాంతం, గుట్టలు ఎక్కువగా ఉండటం తో సీతాఫలాలు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి.
సేకరించిన పండ్లను హుస్నాబాద్ బస్స్టాం డ్ ప్రాంతానికి తెచ్చి ఇక్కడినుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సీతాఫలాలకు మార్కెట్‌గా హుస్నాబాద్ బస్టాండ్ ప్రాంతం మారింది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, నర్మెట, నంగునూర్, భీమదేవరపల్లి తదితర మండలాలనుంచి వస్తున్న సీతాఫలాలను కరీంనగర్, హుజురాబాద్, హన్మకొండకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మంచి ధరలు ఉండటంతో నిత్యం ఇక్కడినుంచి వేరే ప్రాం తాలకు తరలిస్తున్నారు.
వ్యాపారం వేలరూపాయల్లో సాగుతుండడంతో సేకరణ కోసం వందలామంది పనిచేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో సీతాఫలాల విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మెదక్ జిల్లాలోని పలు గ్రామాలతో పాటు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి ఇక్కడికి తెచ్చి విక్రయిస్తున్నారు. రోజూ రామాయంపేట నుంచి మూడు నుంచి నాలుగు వరకు డీసీఎంలల్లో సీతాఫలాలను వ్యాపారులు మహారాష్ట్ర, కర్ణాటక,బీహార్, మధ్యప్రదేశ్, ఏపీ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. రామాయంపేటలో సీతాఫలాలు విక్రయించి ప్రతిరోజూ వందలాది మంది ఉపాధి పొందుతున్నారు.