గజ్వేల్, జూలై 27: రాష్ట్రంలో వరినాట్లు వేసుకుంటున్న సమయంలో మోటర్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయని, రేవంత్‌రెడ్డి పేరు చెబితేనే రైతులు కన్నెర చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నా రు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు ఆగమైతున్నారని, సమైక్య రాష్ట్రంలోని పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో నెలలో 200 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని, నిరంతరం కాలిపోతుండడంతో రైతులు వాటిని రిపేర్ చేయించుకునేందుకు రూ. 5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో 24గంటల నాణ్యమైన కరెంట్ సరఫరాతో రెండు పంటలు పండించుకొని రైతులు సంతోషంగా ఉన్నారని, నేడు ఆ పరిస్థితులు లేవన్నారు. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నదాతలు గుణపాఠం చెప్పుతారని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ రైతును రాజు చేస్తే రేవంత్‌రెడ్డి బిచ్చగాళ్లను చేస్తున్నారని విమర్శించారు. సాగునీరు ఇవ్వడం లేదని, ఎరువుల అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శిచారు.