అందోల్, జనవరి 12: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా పండుగకు స్వగ్రామాలకు పయనమవుతున్నారు. దీంతో రెండు రోజులుగా ఏ బస్సు చూసినా పరిమితికి మించి ప్రయాణికులతో కనిపిస్తున్నది. ఇదే అదునుగా ఆర్టీసీ అధికారులు స్పెషల్ సర్వీసుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
పండుగ సందర్భంగా ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నామని చెబుతున్నా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మాత్రం బస్సులు ఉండడంలేదని అంటున్నారు. మహాలక్ష్మి పథకంతో ఇప్పటికే బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటున్నది, ఇప్పుడు పండుగ ఉండడంతో బస్సులో కాలు పెట్టేందుకు స్థలం ఉండడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ కావడంతో సొంతూర్లకు వెళ్లక తప్పని పరిస్థితి. దీంతో పడుతూ… లేస్తూ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణాలు సాగిస్తున్నామంటున్నారు ప్రజలు.
ఆర్టీసీ స్పెషల్ చార్జీలు వసూలు చేయడం సరికాదంటున్నారు. ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేయడం, మరికొన్ని బస్సులకు ‘స్పెషల్’ అంటూ బోర్డులు తగిలించి అధిక చార్జీలు వసూలు చేస్తుండడంతో కండక్టర్లతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో కండక్టర్లు సైతం ప్రయాణికులకు సర్ధిచెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. పండుగల పేరుతో ఆర్టీసీ అదనపు చార్జీ వసూలు చేయడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.