చేర్యాల, ఆగస్టు 11 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఒడిబియ్యం పోయడం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకున్నారు.
పలువురు భక్తులు నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకుని బోనాలు సమర్పించారు. రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. ఆలయ ఈవో ఎ.బాలాజీ, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్లు సురేందర్, శ్రీరాములు, సిబ్బంది, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఒగ్గు పూజారులు, అర్చకులు భక్తులకు సేవలందించారు.
నూతనంగా నిర్మించిన ప్రసాదాల టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయ కౌంటర్ల వద్ద భక్తులు ఎక్కువ సమయం క్యూలో ఉండాల్సి వస్తున్నది. ప్రతి ఆదివారం,బుధవారాలతో పాటు ప్రత్యేక రోజులు, పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
స్వామి వారి దర్శనం అనంతరం భక్తులు ప్రసాదాలు కొనుగోలుకు కౌంటర్ల వద్దకు వెళ్లి గంటల పాటు టికెట్లు కొనుగోలు చేసి ప్రసాదాలు తీసుకునేంత వరకు వేచి ఉండాల్సి వస్తున్నది. కౌంటర్ల ముందు నీడ కోసం ఎలాంటి నిర్మాణాలు చేపట్టక పోవడంతో ఎండకు, వానకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.