సిద్దిపేట, ఆగస్టు 22( నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు రణం చేసిండ్రు…సంపూర్ణ రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసిండ్రు. అబద్ధాలు వద్దు..రుణమాఫీ ముద్దు…కొందరికి కాదు ..అందరికీ రుణమాఫీ చేయాలి. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి…చెప్పేది కొండంత..చేసేది గోరంత. ఒక్కో మంత్రి ..ఒక్కో మాట..పూటకో మాట రోజుకో తీరు, రుణమాఫీ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లో గురువారం పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీ ముఖ్యనాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఫ్లకార్డులు పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవోలకు, తహసీల్దార్లకు, వ్యవసాయ శాఖ అధికారులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని వినతి పత్రాలు అందజేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ధర్నాలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సాఫీగా కొనసాగాయి. శాంతియుత పద్ధతిలో నిరసనలను తెలియజేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో స్థానిక నాయకులు, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్, జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.
మెదక్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మె ల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజూ శ్రీ జైపాల్‌రెడ్డి స్థానిక నేతలు, పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదలలో నాయకులు ఆదర్శ్‌రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్, సోమిరెడ్డి, కొలన్ బాల్‌రెడ్డి, గోవర్థన్‌రెడ్డి తదితర నేతలు, ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేటలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ఇతర నేతలు, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఇతర నేతలు, జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మె ల్యే మాణిక్‌రావు ఇతర పార్లీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. అన్ని మండల కేంద్రాల్లో స్థానిక నేతలు, మండల ముఖ్యనేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాల అనంతరం ఆర్డీవోలకు, తహసీల్దార్లకు, వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. వినతి పత్రాల్లో రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ కానీ రైతులకు ఆంక్షలు లేకుండా ప్రతి గ్రామంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. రైతులందరూ రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకర్ల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ, నాయకుల చుట్టూ, రైతు వేదికల చుట్టూ తిరిగి తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటివరకు 42శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని, ఇంకా 58శాతం మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. రైతులకు రుణమాఫీ కాకపోవడంతో రైతులందరూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయవలసిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులందరికీ షరతులు లేకుం డా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల ధర్నా సూపర్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గ కేంద్రాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ధర్నాలు చేపట్టారు. అయా మండల కేంద్రాల్లో నిర్వహించిన ధర్నా శిబిరాలకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారు. అన్ని ఆర్హతలు ఉన్న తమకు రుణమాఫీ కాలేదని చెప్పుకున్నారు. ఎన్నికల ముందు అనేక మాయమాటలు చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మాటమార్చి రుణమాఫీ ఎగ్గొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ఎలాం టి షరతులు లేకుండా రైతులకు తక్షణమే రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.