సంగారెడ్డి, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల నీటి సరఫరాపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో పబ్లిక్ హెల్త్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది మరువక ముందే బుధవారం సంగారెడ్డి రాజంపేటలోని మంజీరా ఫిల్టర్ బెడ్‌ను ఆయన తనిఖీ చేసి, అక్కడే సంగారెడ్డి మున్సిపాలిటీలో నీటి సరఫరాపై పబ్లిక్‌హెల్త్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏ హోదాలో సమీక్షలు నిర్వహిస్తున్నారని, సంగారెడ్డిలో అధికారులతో సమీక్షలు జరుపుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయంలో రాజ్యాంగబద్ధ్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మాత్రమే సమీక్ష నిర్వహించాల్సి ఉంటుం ది. అందుకు విరుద్ధ్దంగా జగ్గారెడ్డి సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఛాంబర్లో సమీక్ష జరిపి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వంలో ఏ పదవిలో లేకుండా కేవలం పార్టీ నాయకుడి హోదాలో జగ్గారెడ్డి ఆధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేయడం తో పాటు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన జగ్గారెడ్డి బుధవారం ఏకంగా సంగారెడ్డి మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి సంగారెడ్డి పట్టణం రాజంపేటలోని మంజీరా ఫిల్టర్ బెడ్‌ను తనిఖీ చేశారు. నీటి శుద్ధి, నీటి సరఫరాను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష జరిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి మిషన్‌భగీరథ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా పది ట్యాంకుల ద్వారా మంజీరా నీటిని సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. ఫిల్టర్ బెడ్ విస్తరణకు మూడు ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గతంలోనూ జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో బైపాస్‌రోడ్డు నిర్మాణానికి సంబంధించి హెచ్ఎండీఏ అధికారులతో సమావేశం నిర్వహించడంతో పాటు వారితో కలిసి బైపాస్‌రోడ్డులో కొలతలు తీసుకోవడం విమర్శలకు దారితీసింది. గతంలో సంగారెడ్డి పట్టణంలో చెరువుల మరమ్మతులు, మహాబూబ్సాగర్ చెరువు సుందీకరణ పనులపై ఇరిగేషన్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రులను లేకుండానే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వయంగా అధికారులతో సమీక్షలు జరపడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వటాన్ని సొంత పార్టీ నాయకులు సైతం తప్పుబడుతున్నారు. జిల్లా కలెక్టర్ సైతం ప్రావీణ్య సైతం పబ్లిక్‌హెల్త్, మున్సిపల్ అధికారులు తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తన అనుమతి లేకుండా సచివాలయంలో సమీక్ష సమావేశానికి అధికారులు ఎలా హాజరవుతారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయమై మున్సిపల్, పబ్లిక్‌హెల్త్ అధికారులను వివరణ కోరినట్లు సమాచారం.