సంగారెడ్డి, జనవరి 3(నమస్తే తెలంగాణ): కేజీవీబీ ఉద్యోగుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ మంత్రులు కుట్ర చేస్తున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డిలోని సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేజీవీబీ ఉద్యోగులు చేస్తున్న 25 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. కేజీవీబీ ఉద్యోగుల సమ్మెను అణిచివేయాలని ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సరికాదన్నారు.
ప్రభుత్వం వెంటనే కేవీజీవీ ఉద్యోగులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాం డ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఓ రాజకీయ జిమ్మక్కుగా ఆయన అభివర్ణించారు. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో ఆడ పిల్లలు అక్షరాస్యతలో వెనకబడి ఉన్నట్లు గుర్తుచేశారు. సావిత్రబాయి ఫూలేపై గౌరవం ఉంటే ప్రభుత్వం ఆడపిల్లల అక్షరాస్యతాశాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం సాధ్యం కాద ని బీజేపీకి కూడా తెలుసు అన్నారు. అయినప్పటికీ జమిలి ఎన్నికల బిల్లుపై రాజకీయం చేస్తున్నదని రాఘవులు విమర్శించారు. పంజాబ్ రైతు దలేవాల్ చేస్తున్న నిరాహార దీక్షను కేంద్ర ప్రభు త్వం విరమింపజేయాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పటి వర కు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
గిట్టుబాటు ధరల విషయంలో కోర్టు మొట్టికాయలు వేసినా కేం ద్రం స్పందించడం లేదన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకులు చేరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు చుక్క రాములు, ఎంఏ రమణ, జిల్లా నాయకులు జయరాజ్, బి.మల్లేశం, మాణిక్యం, అడివ య్య తదితరులు పాల్గొన్నారు.