గజ్వేల్, జూన్ 4: ఛత్తీస్గఢ్ ఏవోబీ ప్రాంతంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం కోసం ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలను, గిరిజనులను నక్సలెట్ల పేరుతో భయభ్రాంతలకు గురిచేస్తూ ఎన్కౌంటర్లు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ డిమాండ్ చేశారు.
సీపీఐ 17వ మండల మహాసభ సందర్భంగా బుధవారం గజ్వేల్లోని ఇందిరాపార్కు చౌరస్తా నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి కోలా అభిరాం గార్డెన్లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఆదివాసీల పక్షాన పోరాడుతున్న మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా ఈ మధ్య ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిని హత్య చేయడం సరైంది కాదన్నారు. చర్చలు జరపాలని కోరితే నరేంద్రమోదీ, అమిత్షా ఆదివాసీలను చంపుతున్నారని ఆరోపించారు.
ఆర్అండ్ఆర్ కాలనీలోని ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల సభ్యులను మోసం చేసి డబ్బులు డ్రా చేసిన ఆర్పీ వెనుకున్న అధికారులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సీపీఐ నాయకులు దయానందరెడ్డి, శివలింగు కృష్ణ, పోచమ్మ, శ్రీను, రాజేశం, రమణాకర్, సాయి, ఎల్లం, నర్సింహులు యాదయ్య, యాదగిరి బాల్నర్సయ్య పాల్గొన్నారు.