సంగారెడ్డి జూన్ 2 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలో అవినీతి మేట వేస్తోంది. కిందిస్థాయిలో పనిచేసే ఇరిగేషన్ ఏఈ మొదలుకుని సీఈ వరకు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గుమ్మడిదల ఏఈ లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. తాజాగా అవినీతి ఆరోపణలపై ఇరిగేషన్ ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్ ధర్మపై బదిలీ వేటు పడింది. సంగారెడ్డి జిల్లాలో నీటిపారుదలశాఖ ఇన్చార్జి సీఈగా పనిచేస్తున్న కె.ధర్మను ఆబాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించడంతోపాటు హైదరాబాద్‌లోని ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) ఆఫీస్‌కు సరెండర్ చేసింది. హైదరాబాద్ సీఈ బాధ్యతల నుంచి ధర్మను ప్రభుత్వం తప్పించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ ఇన్చార్జి సీఈగా ధర్మ ఏడాది క్రితం బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి సీఈగా పనిచేస్తున్న ధర్మ ప్రస్తుతం హైదరాబాద్ సీఈ (ఎఫ్ఏసీ)గా కొనసాగుతున్నారు. చెరువులు, నాలాల సమీపంలో భవనాల నిర్మాణాలకు సంబంధించి ఎన్వోసీ జారీలో సీఈది కీలకపాత్ర. ఎన్వోసీ జారీ చేసే విషయంలో కిందిస్థాయిలో పనిచేస్తున్న ఏఈ నుంచి మొదలుకుని చీఫ్ ఇంజినీర్ వరకు అందరూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్వోసీ జారీ విషయంలో ఇరిగేషన్ అధికారులు కోట్లల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇన్చార్జి సీఈగా ఉన్న కె.ధర్మ ఓ భవన నిర్మాణానికి ఎన్వోసీ జారీ చేసేందుకు యజమాని నుంచి రూ.1.50 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో జిల్లాలో పనిచేసిన రిటైర్డు ఎస్ఈ ఒకరు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. నిబంధనల మేరకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తనను డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో సద రు యజమాని విషయాన్ని ఓ మంత్రి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లాతోపాటు హైదరాబాద్ కార్యాలయంలో సైతం సీఈ పనిచేస్తున్న ధర్మ గుట్టుగా అవినీతి వ్యవహారాలు సాగిస్తున్న విషయాన్ని తెలుసుకున్న సదరు మంత్రి విషయాన్ని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు తెలిపారు. మంత్రి సూచన మేరకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు విచారణ చేసి ధర్మపై బదిలీ వేశారు.
అవినీతి ఆరోపణలపై బదిలీ వేటు పడిన ధర్మ మరో నెలరోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల గుమ్మడిదల ఏఈ రవికిశోర్ లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రవికిశోర్ అవినీతి వ్యవహారం వెనుక ఓ ఉన్నతాధికారి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే సదరు అధికారి ఏసీబీ వల నుంచి తప్పించుకున్నారు.లంచం తీసుకుంటూ ఏఈ ఏసీబీకి చిక్కిటం, సీఈ స్థాయి అధికారులపై బదిలీ వేటు పడ టం ఇరిగేషన్లో అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఇరిగేషన్ ఇన్చార్జి సీఈ కె.ధర్మపై బదిలీ వేటు వెనుక పొలిటికల్ వార్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇన్చార్జి సీఈగా ఉన్న ధర్మ పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి అనుకూలంగా పనిచేస్తున్నట్లు సమాచారం. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధిం చి ఎన్వోసీలు, ఇతర నీటిపారుదలశాఖ అనుమతులు జారీ విషయంలో సదరు ప్రజాప్రతినిధి ఏమిచెప్పినా అందుకు అనుకూలంగా ఇన్చార్జి సీఈ ధర్మ నిర్ణయం తీసుకునేవారని తెలిసింది.
జిల్లా పాలన వ్యవహారాల్లో కీలకమైన ఓ మంత్రికి ఇది నచ్చలేదు. పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి నీటిపారుదలశాఖలో చక్రం తిప్పటాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోయారని సమాచారం. పటాన్చెరు ప్రజాప్రతినిధికి చెక్‌పెట్టేలా ఇన్చార్జి సీఈ ధర్మపై వేటు పడేలా మంత్రి పావులు కదిపినట్లు తెలుస్తోంది.