హుస్నాబాద్, సెప్టెంబర్ 11: యూరియా కోసం తిరిగి తిరిగి ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను రక్షించుకోలేని దీన స్థితిలో చేతులారా సాగు చేసిన పంటలను తానే పశువుల పాలు చేసుకున్న రైతు ఆవేదన ఇది. మొక్కజొన్నకు ఎంతో ముఖ్యమైన యూరియా దొరకక వేసుకున్న ఎకరం పంటను దక్కించుకునేందుకు నెల రోజులుగా ఎరువుల దుకాణాల చుట్టూ తిరిగాడు. అయినా యూరియా దొరకలేదు. మొక్క దశలోనే ఎదుగుదల నిలిచిపోవడంతో చూసి తట్టుకోలేక ఆవేదనకు గురై పంట కోసి పశువులకు వేస్తున్నాడు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైతుకు యూరియా దొరకక పంటను తానే కోసి పశువుల పాలు చేశాడు. సొంత వ్యవసాయ భూమి లేక కౌలుకు తీసుకుని ఎవుసం చేస్తున్న శ్రీకాంత్ దున్నిన ట్రాక్టర్ కిరాయిలు, విత్తనాలు, అడుగు మందులు, కౌలు డబ్బులు, కూలీల ఖర్చు మట్టిలో కలిసిపోతుండటంతో తట్టుకోలేక కనీసం పశువులకైనా ఉపయోగపడుతుందని పంటలో మేపుతున్నాడు.
నెల రోజుల నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నా ఒక్క బస్తా యూరియా కూడా దొరకలేదు. యూరియా దొరికితే పంటలో కలుపు తీయించి వేసుకుందామని అనుకున్న అతడికి నిరాశే మిగిలింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు. దీంతో శ్రీకాంత్ లాంటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటను రక్షించుకునేందుకు మళ్లీ మళ్లీ యూరియా ఇచ్చే కేంద్రాలకు వెళ్లి క్యూలో నిల్చొని పడిగాపులు కాస్తున్నారు.
కౌలుకు తీసుకున్న భూమిలో ఎంతో కష్టపడి మక్క సాగు చేసిన. మొక్క మొలిచి, మూరెడు ఎత్తు ఎదిగింది. యూరియా దొరికితే కలుపు తీసి యూరియా వేస్తే పంట పచ్చగా తొందరగా ఎదుగుతుందని ఆశపడ్డ. నెల రోజుల నుంచి యూరియా కోసం తిరిగితే ఒక్క బస్తా కూడా దొరకలే. ఇంతల్నే మొక్క పెరుగుడు ఆగిపోయింది. కలుపు మొక్కలు పెరిగాయి. నిలిచిపోయిన పంట ఎదుగుదలను చూసి కన్నీళ్లు పెట్టుకున్న. దిక్కు తోచక మక్క పంటను కోసి పశువులకు వేస్తున్న. వేసిన మక్క పోయింది. కనీసం వరిని కాపాడుకుందామన్నా ఒక్క బస్తా కూడా దొరకలే. సర్కారోళ్లు ఆలోచించాలె. నష్టపోయిన నా లాంటి రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలె.
– శివరాత్రి శ్రీకాంత్, రైతు, మీర్జాపూర్, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా