సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 15: సంగారెడ్డి జిల్లాలో విక్సిత్ భారత్ సంకల్ప్ యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్అఫెర్స్ డైరెక్టర్ పౌసుమిబసు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్, అదనపు కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో విక్సిత్ యాత్రపై పౌసుమి బసు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు గ్రాస్ రూట్ లెవెల్ చేరుకోవాలన్నదే విక్సిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. విక్సిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రచార రథాలను ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారని తెలిపారు.
జిల్లాకు 10 ప్రచారరథాలను కేటాయించారని, ఆయా వాహనాల్లో పీఎం మెసేజ్ ఆడియో, వీడియోతో ఉంటుందన్నారు. ఈనెల 16 నుంచి వచ్చే నెల 25 వరకు ఒక్కో వాహనం రెండు గ్రామ పంచాయతీలకు వెళ్తుందన్నారు. ఆ దిశగా ప్రణాళిక చేసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ శరత్ మాట్లాడూతూ విక్సిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా జిల్లాకు 10 మొబైల్ వ్యాన్లు వచ్చాయని తెలిపారు. షెడ్యూలు మేరకు ప్రతి వాహనం ప్రతిరోజూ రెండు గ్రామ పంచాయతీలను కవర్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్వో నగేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీవోలు పాల్గొన్నారు.