జహీరాబాద్, నవంబర్ 10: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని రంజోల్ బైపాస్ రోడ్డు మార్గంలో ఆదివారం మధ్యా హ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్ల లోడ్‌తో హైదరాబాద్‌కు వెళ్తున్న కంటైనర్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీం తో కంటైనర్‌లో ఉన్న ఎనిమిది కార్లు దగ్ధమయ్యాయి. జహీరాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. ముంబయి నుంచి హైదరాబాద్‌కు కార్ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్‌లో సాంకేతిక సమస్యతో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే కంటైనర్‌ను నిలిపివేశారు.
అక్కడే ఉన్న కొందరు జహీరాబాద్ పట్టణ పోలీసులతో పాటు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బందితో మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారానికి చెందిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సంబంధిత అధికారులు, సిబ్బంది కంటైనర్‌లో చెలరేగిన మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. కంటైనర్, అందులోని ఎనిమిది కొత్త కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ముంబయి-హైదరాబాద్ 65 నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోడ్డు మార్గంలో భారీగా వాహనాలు స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్సై కాశీనాథ్, రూరల్ ఎస్సై ప్రభాకర్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. సాంకేతిక సమస్యతో కంటైనర్‌లో మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో కంటైనర్‌లో ఉన్న 8 కొత్త కార్లు పూర్తిగా కాలిపోయి దాదాపు రూ. 2 కోట్లపైగానే ఆస్తినష్టం జరిగినట్లు సంబంధిత కంపెనీ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ పోలీసులు తెలిపారు.