సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 18: బాలరక్ష, వృద్ధుల ఆశ్రమ భవనాలను త్వరగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డిలోని బాలసదనం, శిశు గృహ, సఖీ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న బాల సదనాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. బాలసదనం చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి అక్కడ అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళా ప్రాంగణంలోని శిశుగృహను సందర్శించారు. చిన్నారులు ఎక్కడి నుంచి వచ్చారు, వారి సంబంధీకులు ఎవరైన ఉన్నారా అని ఆరా తీస్తూ, పిల్లల దత్తతకు త్వరితగతిన వెళ్లాలని సూచించారు. మూడు నుంచి ఐదేండ్ల పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించాలన్నారు. వారికి పౌష్టికాహారం అం దించాలని స్పష్టం చేశారు. చిన్నారులకు అందిస్తున్న సేవలు బాగున్నాయని కలెక్టర్ కితాబిచ్చారు. అక్కడ నుంచి సఖీ కేంద్రాన్ని సందర్శించి అక్కడకు వచ్చే మహిళలకు, ఆడ పిల్లలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. 181కి వచ్చే కాల్స్‌కు స్పందించి వారికి అన్నివిధాలుగా సేవలందించాలని సూచించారు. కార్యక్రమం లో జిల్లా మహిళా సంక్షేమ అధికారి లలిత కుమారి, డీసీపీవో రత్నం, వైద్యారోగ్య శాఖ ఏఈ, డీసీపీయూ, సిబ్బంది పాల్గొన్నారు.