హుస్నాబాద్, జూన్ 28: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్మించిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద అమరవీరుల స్తూపం భూముల పరిరక్షణకు రాష్ట్ర, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్తూపం భూములు రక్షించడం తన బాధ్యత అని అప్పటి జేఏసీ నాయకులతో పాటు ప్రజలకు పొన్నం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆదివారం హుస్నాబాద్‌లో శిథిలావస్థలో ఉన్న స్తూపంతో పాటు భూములను స్థానిక జేఏసీ నాయకులతో కలిపి చాడ వెంకటరెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. స్తూపం నిర్మాణ సమయంలో 4ఎకరాల సీలింగ్ భూమిని కేటాయించడం జరిగిందన్నారు. హైకోర్టులో వచ్చిన తీర్పుకు సంబంధించిన ఫైల్ కనిపించడం లేదని రెవెన్యూ అధికారులు చెప్పడం సరికాదన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ స్తూపం భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనీయమని ఆయన తెగేసి చెప్పారు. సీలింగ్ భూములు పేదలకు చెందాలి తప్ప పెద్దలకు కాదన్నారు. కలెక్టర్ స్పందించి నిజనిర్ధారణ కమిటీ ర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్తూపం భూముల కోసం జేఏసీ నాయకులతో కలిసి భవిష్యత్తులో జరుగబోయే ఉద్యమాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, కోకన్వీనర్ వీరన్న యాదవ్, సీపీఐ నాయకులు గడిపె మల్లేశ్, మల్కిరెడ్డి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.