సిద్దిపేట అర్బన్, మార్చి 21: గోదావరి పరీవాహక రైతులు సాగునీరు లేక అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ‘గోదావరి కన్నీటి గోస’ పేరుతో గోదావరి నది నుంచి కొండపోచమ్మసాగర్ వరకు కోరుకంటి చందర్ చేపట్టిన మహా పాదయత్ర గురువారం రాత్రి సిద్దిపేట పట్టణానికి చేరింది. శుక్రవారం సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి సమస్య ఉండకూడదని, ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలని కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధ్దరణ చేపట్టారన్నారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే గొప్ప ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నీటి దిశను మార్చి తెలంగాణ దశను మార్చేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారన్నారు.
కేసీఆర్ ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే గొప్ప పరిపాలన చేస్తే.. ఎన్నికల సమయంలో కాళేశ్వరం కూలిపోయిందని అనేక అబద్ధ్దపు, మోసపు ప్రచారాలు చేసి ప్రజలను తప్పదోవ పట్టించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రజలంతా నేడు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధ్దాన్ని నిజం చేయడానికి, మరో వంద అబద్ధ్దాలు ఆడుతూ 15 నెలలుగా గోదావరిని ఎండబెడుతున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పటిష్టంగానే ఉందని ఇటీవల మంత్రి ఉత్తమ్ చెప్పినప్పటికీ ఎందుకు నీటిని ఎత్తిపోయడం లేదని కోరుకంటి చందర్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తదని మేడిగడ్డ బరేజ్‌కు ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడం లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 365 రోజులు నిండుకుండలా ఉన్న గోదావరిలో తాను ఐదేండ్ల పాటు పడవల పోటీలు నిర్వహించానని గుర్తుచేశారు. గోదావరి ఎండిపోయిన కారణంగా రామగుండం నియోజకవర్గంలో పదిరోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. అసమర్థ పాలన వల్లనే గోదావరి నది ఎండిపోయిందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడానికే 180 కి.మీల పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.
బీఆర్ఎస్, కేసీఆర్ మీద కోపంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగదని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. అందుకే ఎండిపోయిన గోదావరి నుంచి కొండపోచమ్మసాగర్‌కు పాదయాత్రగా బయల్దేరినట్లు తెలిపారు. తాము పాదయాత్రగా వెళ్తుంటే ఏ గ్రామానికి వెళ్లినా నీళ్లు రావడం లేదని రైతులు బాధ వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నీళ్లకోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కోరుకంటి చందర్ హెచ్చరించారు. సిద్దిపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, నాయకులు వంగ తిరుమల్‌రెడ్డి, రవీందర్, రాజ్‌కుమార్, వెంకటేశ్, భాస్కర్, దేవరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొండపాక(కుకునూరుపల్లి), మార్చి 21: రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర శుక్రవారం సాయంత్రం కొండపాక మండలంలోని దుద్దెడకు చేరుకుంది. కోరుకంటి చందర్‌కు బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పూలమాల వేసి శాలువాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దుద్దెడలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అనంతులు అశ్వినీప్రశాంత్, మాజీ ఎంపీపీ ర్యాగల సుగణాదుర్గయ్య, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్, మాజీ ఎంపీపీ రాధాకృష్ణారెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, పలు గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.