సంగారెడ్డి, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): ‘తలోదారి’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టించింది. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్‌గౌడ్, నీలం మధు మధ్య నెలకొన్న వర్గపోరుపై కథనం ప్రచురితం కావడం పటాన్చెరు, సంగారెడ్డి కాంగ్రెస్ నాయకుల్లో చర్చనీయాంశమైంది. ఈ కథనాన్ని కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకోవడం, ముగ్గరు నేతల మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెట్టుకున్నారు.
కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు నమస్తే కథనాన్ని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పటాన్చెరులో పార్టీ పరిస్థితిని వివరిస్తూ మరింత నష్టం జరగకుండా చూడాలని కోరినట్లు తెలుస్తుంది.‘నమస్తే తెలంగాణ’ కథనం కాటా శ్రీనివాస్‌గౌడ్ మద్దతుదారుల్లో కదలికకు దారితీసింది. సొంతపార్టీలోనే ప్రాధాన్యం లేకుండా ఎన్నిరోజులు ఇలా ఉండాలి, అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుందాం అంటూ కాటా అనుచరులు గురువారం ఉదయం ఆయన వద్ద పట్టుబట్టారు.
దీంతో కాటా శ్రీనివాస్‌గౌడ్ 200 మంది మద్దతుదారులతో కలిసి హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు చేరుకున్నారు. అక్కడ కాటా శ్రీనివాస్‌గౌడ్ మద్దతుదారులతో అధిష్టానం తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పటాన్చెరులో అసలైన కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను కాపాడాలని, కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు న్యాయం చేయాలంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న కాటా శ్రీనివాస్‌గౌడ్ గురువారం పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు, తన అనుచరులతో కలిసి గాంధీభవన్ వెళ్లారు. గాంధీభవన్‌లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను ఆయన కలిశారు. పటాన్చెరు నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అటు పార్టీ, ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పదేండ్లుగా పటాన్చెరులో బీఆర్ఎస్పై తాను పోరాటం చేశానని, ఇప్పుడు తనను కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన మహిపాల్‌రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
పార్టీ కోసం పనిచేసిన తనను విస్మరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తనకు అనుకూలమైన అధికారులను రాత్రికి రాత్రి పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారని, తన అనుకూలమైన వారికి ప్రయోజనాలు చేకూరుస్తున్నారని కాటా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ తమను మాత్రం ఆహ్వానించడం లేదని ఫిర్యాదు చేశారు. పటాన్చెరులో కాంగ్రెస్ బతకాలంటే తనకు న్యాయం చేయాలని బట్టి విక్రమార్కను, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను కాటా శ్రీనివాస్ కోరారు.
దీనిపై బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ స్పందిస్తూ త్వరలోనే పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి చక్కదిద్దడంతో పాటు కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అధిష్టానం హామీతో కాటా శ్రీ నివాస్‌గౌడ్ సంతృప్తి చెందినట్లు తెలుస్తుంది. పీసీసీ ఛీప్ మహేశ్‌గౌడ్ సైతం త్వరలోనే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కాటా శ్రీనివాస్‌గౌడ్, నీలం మధును పిలపించుకుని పరిస్థితిని చక్కదిద్దాలని యోచిస్తున్నట్లు సమాచారం. గాంధీభవన్‌కు వెళ్లిన వారిలో పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు చంద్రారెడ్డి, శశిధర్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, మహేశ్‌గౌడ్, రాజిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నర్సింగ్‌రావు, వడ్డే కృష్ణ, సుధాకర్‌యాదవ్, మన్నె రవీందర్ తదితరులు ఉన్నారు.