పెద్ద శంకరంపేట, ఆగస్టు 12 : మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి యత్నించారు. మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఇంటికి వచ్చే సమయంలో ఆయన వాహనాన్ని అడ్డుకుని దాడి చేయబోయారు.
సోషల్‌మీడియాలో వచ్చిన కథనాలపై పెద్దశంకరంపేటలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో మంగళవారం ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.. మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అదే సమయంలో జంగం శ్రీనివాస్‌తో కలిసి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అక్కడకు వచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా వారి వాహనంపైకి దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కాంగ్రెస్ నాయకులను చెదరగొట్టారు. అనంతరం ఇరువర్గాలను అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పై కఠిన చర్యలు
సోషల్‌మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా వ్యక్తిగత దూషణలకు పాల్పడితే ఆ గ్రూప్ అడ్మిన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గం సీఐ రేణుక హెచ్చరించారు. గ్రూపులలో వ్యక్తిగత దూషణలకు సంబంధించి పోస్టులు చేస్తే అడ్మిన్ వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. వీటిపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు.