దుబ్బాక, మే 1 : సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చితే…కాంగ్రెస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రజలపై నిర్లక్ష్యం చూపుతున్నది. దుబ్బాకలో నిరుపేదల కోసం మల్లాయిపల్లి రోడ్డులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు. ఈ కాలనీలో 76 బ్లాక్‌లు, ఒక్కో బ్లాక్‌లో 12 ఇండ్లు నిర్మించారు.
సుమారు 3 వేలకు పైగా ఇక్కడ జనాభా నివసిస్తున్నది. కొంతకాలంగా ఈ కాలనీని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ముగిసిపోవడంతో కాలనీ ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రధానంగా తాగునీరు. పారిశుధ్య లోపంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుబ్బాక డబుల్ బెడ్రూమ్ కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టక పోవడంతో ప్రజలకు సమస్యగా మారిం ది. డ్రైనేజీలు నిండి, మురుగు రోడ్డుపైకి చేరుతున్నది. కాలనీలోని అంతర్గత రహదారులపై పారుతున్న మురుగుతో ప్రజలు అనారోగ్యంపాలవుతున్నారు. ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలతో మరింత సమస్యగా మారింది. దోమలు , విషకీటకాలు వృద్ధి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలో పారిశుధ్యం, ఇతర సమస్యలపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని స్థానికులు గోడు వెల్లబోసుకుంటున్నారు.
డబుల్ బెడ్రూమ్ కాలనీలో డ్రైనేజీ సమస్య ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. కాలనీని సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా. పారిశుధ్యం మెరుగుపర్చేందుకు కాలనీ ప్రజలు రోడ్లపై చెత్తాచెదా రం వేయకుండా సహకరిస్తే బాగుంటుంది. ఇందు కోసం కాలనీ ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు మావంతు కృషిచేస్తాం.
– శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దుబ్బాక, సిద్దిపేట జిల్లా
డబుల్ బెడ్రూమ్ కాలనీపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. ఇక్కడ ఉండేది నిరుపేదలమే. రెక్కాడితే డొక్కాడని మా బతుకులు. కాలనీలో తాగునీటితో పాటు పారిశుధ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయంపై పలుమార్లు మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
– కారంపూరి నగేశ్, కాలనీవాసి, దుబ్బాక, సిద్దిపేట జిల్లా
డబుల్ బెడ్రూమ్ కాలనీలో చాలా సమస్యలు నెలకొ న్నాయి. ఇక్కడికి ఏ అధికారి రావడం లేదు. మురుగు కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. దోమలు, విష కీటకాలతో అనారోగ్యం పాలవుతున్నాం. మురుగు కాల్వల ను మేమే శుభ్రం చేసుకునే పరిస్థితి ఉంది. అధికారులు మా సమస్యలను పరిష్కరించాలి.
– సామిలేటి రాజేందర్, కాలనీవాసి,దుబ్బాక, సిద్దిపేట జిల్లా