సిద్దిపేట అర్బన్, నవంబర్ 24 : అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన హంగులతో నిర్మితమైన సిద్దిపేట జిల్లా జైలు ప్రారంభానికి సిద్ధమైంది. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామ శివారులోని 34 ఎకరాల్లో జైలు నిర్మితమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో మంజూ రు కాగా.. 2023 జూన్ 20వ తేదీన నాటి మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు జిల్లా జైలుకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల్లో శంకుస్థాపన చేసిన మొదటి జిల్లా జైలు ఇదే కావడం విశేషం.
రాష్ర్టానికే ఆదర్శంగా ఉండేలా సిద్దిపేట జిల్లా జైలు నిర్మాణం చేపట్టారు. సుమారు ఎనిమిది సంవత్సరాల కృషి ఫలితంగానే నాడు సిద్దిపేటకు జిల్లా కర్మాగారం మంజూరైందని హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామ శివారులో 34 ఎకరాల విస్తీర్ణంలో రూ.78 కోట్ల వ్యయంతో 425 మంది ఖైదీలు ఉండే విధంగా నాటి మంత్రి హరీశ్‌రావు ఈ జైలుకు శంకుస్థాపన చేశారు. జిల్లా జైలు సమీపంలోనే కేంద్రియ విద్యాలయంతో పాటు 1000 పడకల ప్రభుత్వ దవాఖాన, మెడికల్ కళాశాల ఉన్నాయి.
ఈ జైలులో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని నాడు హరీశ్‌రావు తెలిపారు. ఖైదీలకు ధ్యానం, యోగా, నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి శిక్షణ కూడా ఇచ్చేందుకు నాడు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రణాళికలు రూపొందించారు. జైలు ప్రారంభం అనంతరం ప్రస్తుతం సిద్దిపేట పట్టణంలో కొనసాగుతున్న సబ్ జైలు ఈ జిల్లా జైలుకు తరలించనున్నారు. శంకుస్థాపన చేసిన ఏడాదిలో ఈ జైలు పూర్తి కావాల్సి ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల సుమారు రెండున్నర సంవత్సరాలు పట్టిందని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.