క్రీడాకారులను ప్రోత్సహించి మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ క్రీడా ప్రాంగణాలను పట్టించుకోవడం లేదు. దీంతో వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో గడ్డి మొలిచి పిచ్చిమొక్కలతో అధ్వానంగా తయారయ్యాయి. క్రీడాకారులకు ఇక్కట్లు తప్పడం లేదు.
మెదక్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. కానీ వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కో ప్రాంగణానికి క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. కానీ వాటిని బయటకు తీసి ఆటలు ఆడిన దాఖలాలు ఎక్కడా లేవు. క్రీడా ప్రాంగణాలను పట్టించుకునే నాథుడు లేడు.
దీంతో గడ్డి మొలిచి పిచ్చిమొక్కలతో అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని చోట్ల పశువులు సంచరిస్తూ గడ్డిమేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని క్రీడా ప్రాంగణాలు మందుబాబులకు అడ్డాగా మారా యి. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్టులతో పాటు లాంగ్ జంప్ పిట్, వ్యా యామం కోసం సింగిల్, డబుల్ బార్లు ఉండాలి, కానీ క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల అవి ఎక్కడా కనిపించడం లేదని క్రీడాకారు లు వాపోతున్నారు. ఆట స్థలాల చుట్టూ నీడనిచ్చే మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది సంరక్షించాల్సిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పట్టించుకోవడం లేదు.
మెదక్ జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలతో పాటు 81 హ్యాబిటేషన్లు ఉండగా, 456 గ్రామ పంచాయతీల్లో ఒకటి చొప్పున క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 2వేల చదరపు గజాలు లేదా 20 గుంటలకు తగ్గకుండా భూమిని కేటాయించారు. ఇందుకోసం రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చుచేసి తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. చాలా గ్రామాల్లో స్థలాల కొరత ఉండడంతో పాఠశాల ప్రాంగణాలు, ఖాళీగా ఉన్న కొద్దిపాటి స్థలాల్లో, వైకుంఠధామాల పక్కన తెలంగాణ ప్రాంగణం పేరిట బోర్డు, వాలీబాల్ కోర్టు, వ్యాయామం చేసేందుకు రెండు పరికరాలు ఏర్పాటు చేసి నామ్‌కే వాస్తేగా వదిలేశారు.
కొన్ని చోట్ల కేవలం క్రీడా ప్రాంగణాల పేరుతో బోర్డులు పెట్టి ఇతరత్రా వసతులను విస్మరించారు. పట్టణాల్లోనూ వార్డుకో క్రీడా ప్రాంగణం ఉండాల్సి ఉండగా స్థలం కొరత వల్ల నాలు గు మున్సిపాలిటీల పరిధిలో అక్కడక్కడా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. నిర్వహణ సక్రమంగా లేక పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారాయి. మరో వైపు నిధుల కొరత వల్ల పంచాయతీలు వీటి నిర్వహణ చేపట్టలేక పూర్తిగా గాలికొదిలేశాయని పలువురు పేర్కొంటున్నారు.
గతంలో పంపిణీ చేసిన స్పోర్ట్స్ కిట్స్‌లోని సామగ్రిస్పోర్ట్స్ కిట్లలో మేజరింగ్ టేపు 1, డిస్కస్‌త్రో 1, 2 కిలోలు, టెన్నికాయట్ రిం గులు 6, స్కిప్పింగ్ రోప్‌లు 6, ప్లాస్టిక్ విజిల్స్ 3, స్టాప్ అండ్ గో వాడెన్ 1, సింథటిక్ వాలీబాల్ 1, నెట్ 1, సైకిల్ పంపు, బిగ్ సైజ్ (ఫుట్పంపు)1 ఉంటాయి. డంబెల్స్ మూడు సెట్లు, టీషర్టు 75, క్రికెట్ బ్యాట్ నం.5, బ్యాటింగ్ గ్లౌజ్‌లు ఒక జత, లెగ్ ప్యాడ్లు రెండు జత లు, వికెట్ కీపింగ్ లెగ్ గార్డు ప్యాడ్ ఒక జత, స్టం ప్స్ సెట్ 2 జతలు, లబ్డామినల్ గార్డ్స్ 2 జతలు, ప్రాక్టిస్ బాల్స్ 6, ఆర్మ్‌గార్డ్స్ 2, క్రికెట్ కిట్ బ్యాగ్ 1 ఉన్నాయి.
మెదక్ జిల్లాలోని పలు క్రీడా ప్రాంగణాలకు 2023లో కిట్లు పంపిణీ చేశారు. ఒక్కో క్రీడా యూనిట్ విలువ రూ.68వేలు ఉంటుంది. ఇందులో జిమ్ పరికరాలతో పాటు క్రికెట్, వాలీబాల్ ఆటలకు సంబంధించిన సామగ్రి ఉంది. కానీ చాలా చోట్ల వినియోగంలో లేక గ్రామ పంచాయతీ గదుల్లో మూలన పడేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.