గజ్వేల్, ఏప్రిల్ 20 : సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ ప్రధాన రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చడం లేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన రోడ్డుపై తారు లేచిపోవడంతో పదుల సంఖ్యలో గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో వెళ్లే ద్విచక్ర వాహనదారులకు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డుకు ఇరువైపులా గుంతలు పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో రెండు లేన్లుగా ఉన్న రోడ్డును కేసీఆర్ అధికారంలోకి రాగానే నాలుగు లేన్లుగా వెడల్పు చేయించి మధ్యలో డివైడర్, బటర్ఫ్లై లైట్లు, ఇరువైపులా మొక్కలు నాటించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో రోడ్డుపై ఎక్కడ గుంతలు పడినా వెంటనే మరమ్మతులు చేసిన అధికారులు ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. నిత్యం అదే మార్గంలో సంబంధిత అధికారులతో పాటు ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డుకు మోక్షం కలగడం లేదు.
రోజు ఇదే మార్గంలో వాహనదారులు తమ గమ్యస్థానాలకు వేలాదిగా వెళ్తుంటారు. గుంతలమయంగా ఉన్న రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.