సిద్దిపేట, జూలై 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాపై వివక్ష చూపుతున్నది. జిల్లాకేంద్రం సిద్దిపేటలో అభివృద్ధిని అడ్డుకుంటున్నది. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులన్నీ రద్దు చేసింది. నిర్మాణాలు మధ్యలో ఉన్న వాటికి నిధులు బంద్ జేసింది. ఇక్కడి పనులు ఇతర ప్రాంతాలకు తరలించుకు పోయింది. ఇది సరిపోదు అన్నట్టు ఏకంగా జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ సిద్దిపేటలో నిర్మాణంలో ఉన్న వెయ్యి పడకల దవాఖానపై తన అక్కసు వెళ్లగక్కారు. ఇంత చిన్న పట్టణానికి వెయ్యి పడకల దవాఖాన అవసరమా అంటూ మంగళవారం సిద్దిపేటలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమవేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
దీనిని బట్టి చూస్తే సిద్దిపేట జిల్లా మీద కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష అర్ధం అవుతుంది. మంత్రి వ్యాఖ్యలపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట ప్రాంత ప్రజల కోసం బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రూ. 300 కోట్లతో మెడికల్ కళాశాలకు అనుబంధంగా వెయ్యి పడకల దవాఖాన మంజూరు చేయించారు. ఈ దవాఖాన నిర్మాణం జరిగి అందుబాటులోకి వస్తే సిద్దిపేటతో పాటు పక్కన ఉన్న ఐదు జిల్లాలకు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. బీఆర్ఎస్ హయంలోనే వెయ్యి పడకల దవాఖాన పనులు 90శాతం పూర్తయ్యాయి. కేవలం మైనర్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంతలోనే రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో దవాఖానకు గ్రహణం పట్టింది.
మరో రూ. 25 కోట్ల నిధులు ఖర్చుచేస్తే దవాఖాన అందుబాటులోకి తేవచ్చు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 20 నెలల నుంచి పనుల్లో పురోగతి కరువైంది. నిధులు విడుదల చేయించి దవాఖాన పనులు పూర్తచేయాలని మంగళవారం జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలో మంత్రి వివేక్‌ను స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు కరోరగా, దీనికి మంత్రి వివేక్ స్పందించి సిద్దిపేటలో ఇంత పెద్ద దవాఖాన అవసరమా, ఇప్పటికే ఇక్కడ చాలా ఉన్నాయని తన అక్కసు వెళ్లగక్కారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరూలో కూడా వంద పడకల దవాఖాన ఉందని, ఇక్కడ కూడా వంద పడకల దవాఖాన సరిపోతుందని కామెంట్ చేశారు.
సిద్దిపేటలోని టీహబ్‌లో 120 వివిధ రకాల వైద్య ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేసేవారని, రెండు నెలల నుంచి పరీక్షలు ఆగిపోయాయని, వాటిని పునరుద్ధరించాలని, 50 బెడ్ల ఆయుష్ దవాఖాన ప్రారంభించాలని, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ఓపెన్ చేయాలని, బస్తీ దవాఖానల్లో మందుల సరఫరా చేయాలని, సిబ్బంది జీతాలు రెగ్యులర్‌గా ఇప్పించాలని, బస్తీ దవాఖానల్లో ఏఎన్ఎం, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు జీతాలు విడుదల చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని మంత్రి వివేక్‌ను హరీశ్‌రావు కోరారు. కానీ, మంత్రి వివేక్ ఇవేవి పట్టించుకోకుండా సిద్దిపేటకు ఏం అవసరం లేదంటూ దాట వేశారు.మంత్రి వ్యాఖ్యలపై సిద్దిపేట ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట జిల్లాకు నిధులు ఆపింది. పైసా నిధులు కేటాయించడం లేదు. కేసీఆర్ కేటాయించిన పనులు రద్దు చేసింది. కల్యాణలక్ష్మి చెక్కులను ఆపేయడంతో కోర్టు మెట్లు ఎక్కి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు చెక్కులు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 875.92 కోట్ల పనులు రేవంత్ సర్కారు ఆపేసింది.
సిద్దిపేటలో శిల్పారామం పనులు రూ. 23 కోట్లు, నెక్లెస్ రోడ్డు రూ. 15 కోట్లు, వెటర్నరీ కళాశాల రూ. 300 కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రూ.25 కోట్లు,రంగనాయక సాగర్ టూరిజం పనులు రూ.100 కోట్లు, వెయ్యి పడకల దవాఖానలో వివిధ పనులకు రూ. 27 కోట్లు, మహతి ఆడిటోరియం రూ 50 కోట్లు పనులు ఆగిపోయాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో అభివృద్ధ్ది పనులకు నిధులు మంజూరు చేయకుండా కాం గ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతోంది. జిల్లా అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవ డం లేదు. జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉంది. అస లు ప్రభుత్వం ఉందా..? అన్న అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.