దుబ్బాక, ఏప్రిల్ 5: కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిదని, రేవంత్ సీఎం అయ్యేవాడా అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. దుబ్బాక మండలం ఆకారంలో ఆదివారం సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్‌ను అవమానించేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం బాధకరం అన్నారు. గజ్వేల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పేరిట కాంగ్రెస్ పార్టీ గూండాయిజం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు వీధిరౌడీల్లా ప్రవరించడం తగదన్నారు.
కార్యాలయంలో సీఎం ఫొటో పెట్టేందుకు, ప్రొటోకాల్ అధికారులు చూసుకుంటారని, అలా కాకుండా కాంగ్రెస్ నాయకులు కార్యాలయం తాళం పగులగొట్టి, కిటికీ తలుపులు ధ్వంసం చేయడం ఏమి సంస్కృతి అని ఎమ్మెల్యే మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధిని మరిచి, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని, వారు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.