మునిపల్లి, అక్టోబర్ 12: మొదటి నుంచి ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ అధికారాన్ని అనుభవిస్తున్నదని, ఆరుగ్యారెంటీలు, అనేక హామీలను ఇచ్చి వాటిని ఎగ్గొట్టిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ధ్వజమెత్తారు. ఆదివారం మునిపల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామ శివారులోని శ్రీసాయి గార్డెన్లో సీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలయ్-బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చంటి క్రాంతి కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సత్తాను చాటాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
ప్రజలకు మంచి చేయకపోయినా సరే కాని… చెడు చేయవద్దనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తెరగాలని హితవు పలికారు. ప్రజల చేత కంటతడి పెట్టించిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ఇంటింటికీ చేర్చి, వారి మోసాలను ప్రజల ముందు ఉంచాలన్నారు. కాంగ్రెస్ నాయకులకు పథకాలు అందిస్తున్నారని, కొందరు అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాంటి అధికారులు రానున్న రోజుల్లో చుక్కలు చూపిస్తామని చంటి క్రాంతికిరణ్ హెచ్చరించారు.
అందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దామోదర రాజనర్సింహ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. కార్యక్రమంలో పీఎస్ఆర్ పౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, మాజీ జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్,బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్, మాజీ సర్పంచ్‌లు,మాజీ ఎంపీటీసీలు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.