సాగునీటి సమస్య రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. యాసంగి పంటలను దక్కించుకోవడానికి తం టాలు పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భూగర్భజలాలు అడుగంటాయి. లక్షల రూపాయలు ఖర్చుచేసి బోర్లు తవ్వించినా, బావుల్లో పూడికతీయించినా ఆశించిన స్థాయిలో నీళ్లు రావడం లేదు. ప్రస్తుతం ఏ ఊరిలో చూసినా పొలాల వద్ద బోరు బండ్ల శబ్ధం వినిపిస్తున్నది. క్రేన్లు కనిపిస్తున్నాయి. మళ్లీ పాత రోజు లు గుర్తుకు వస్తున్నాయి. రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
జిల్లాలో అనేక రిజర్వాయర్లు ఉన్నా కాం గ్రెస్ ప్రభుత్వం నీటి విడుదలలో ప్రణాళికతో వ్యవహరించకపోవడంతో నీళ్లందక పంటలు ఎండుతున్నాయి. కాళేశ్వర జలాలను పూర్తిస్థాయిలో ప్రభు త్వం విడుదల చేయలేదు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్లు ఇంతవరకు పత్తా లేవు. సింగూరు ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించింది. ఇతర ప్రాజెక్టుల కింద కాల్వల పనులు చేపట్టకపోవడంతో పొలాలకు నీళ్లు చేరడం లేదు. దీంతో పంటలు ఎండిపోతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు.
సిద్దిపేట, మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యా సంగి సాగు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఎండుతున్న వరి పంటను కాపాడుకోవడానికి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రైతులు అరిగోస పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా పొ లాలకు నీటిని అందిస్తున్నారు. ఉమ్మడి మదక్ జిల్లాలో గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో భూగర్భజలాలు బాగా అడుగంటాయి.
అదే 2023 బీఆర్ఎస్ హయాంలో ఈ రెండు మాసాల్లో భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నా యి. క్రమం తప్పకుండా చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లను కాళేశ్వర జలాలతో నింపడంతో భూగర్భజలా లు వృద్ధి చెందాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రణాళికాబద్ధ్దంగా చెరువులు, చెక్‌డ్యాంలు నింపడంతో ఎక్కడా చూసినా మండుటెండల్లో అలుగులు పారాయి. బోరుబావుల్లో నీటి మట్టం పుష్కలంగా ఉంది. ఫలితంగా రైతులు గుంట పొలం ఎండిపోకుండా కాపాడుకున్నా రు. భూమికి బరువయ్యేలా పంటలను పండించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో భూగర్భజల మట్టం పూర్తిగా అడుగంటడంతో రైతులు అప్పులు చేసి బోరు బావులు తవ్విస్తున్నారు. కొద్దిరోజులుగా ఏ ఊరు వెళ్లినా బోర్లుబండ్లు కనిపిస్తున్నాయి. ఒకటి నుంచి మొదలుకొని ఎనిమిది వరకు బోర్లు తవ్వించిన రైతులు జిల్లాలో ఉన్నా రు. అయినా చుక్కనీరు రాకపోవడంతో రైతులకు అప్పులే మిగులుతున్నాయి.వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు రావడం లేదు. 2023 బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లాలో 7.28 మీటర్లు, మెద క్ జిల్లాలో 10.46 మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 9.75 మీటర్ల లోతులో జలమట్టం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈసారి 2025లో జనవరి నెలలో సిద్దిపేట జిల్లాలో 10.60 మీటర్ల, మెదక్ జిల్లాలో 10.89 మీట ర్ల, సంగారెడ్డి జిల్లాలో 10.27 మీటర్లు ఉంది. ఫిబ్రవరి నెలలో సిద్దిపేట జిల్లాలో 12.14అంటే 5 మీటర్ల లోతు కు పడిపోయింది. మెదక్ జిల్లాలో 13.25 మీట ర్లు ఇక్కడ 3.25 మీటర్ల లోతకు, సంగారెడ్డి జిల్లాలో 12. 60 మీటర్లు, ఇక్కడ 3 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. కేసీఆర్ పాలనలో భూగర్భజలాలు మెరుగ్గా ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో భూగర్భజలాలు అడుగంటి పంట పొలాలు ఎండిపోతున్నాయి. వాటని కాపాడుకోవడానికి రైతు అరిగోస పడుతున్నారు.
నా పేరు చెట్కూరి కిష్టయ్య, మాది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామం. రెండెకరాల్లో వరి పంట వేసిన. ఎకరానికి రూ.30వేల చొప్పున రెండెకరాలకు రూ.60వేల దాకా పెట్టుబడి అయ్యింది. ఎకరానికి విత్తనపు వడ్లకు రూ.2 వేలు, దున్నకం ఖర్చులు రూ.7500, నాటుకూళ్లు రూ.7500, అడుగు మందులకు రూ.6వేలు, పైమందులకు రూ.5500, కలుపుకూళ్లు రూ.1500 మొత్తం రూ 30వేలు, రెండెకరాలకు రూ.60వేల ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఎకరం పూర్తిగా ఎండిపోయింది. పంటను కాపాడుకునేందుకు రెండు బోర్లు తవ్వించినా చుక్కనీళ్లు రాలే. పది రోజుల్లో రెండు బోర్లు వేస్తే రూ.లక్ష అప్పు అయ్యింది. పంట పెట్టుబడికి తోడు రూ.లక్ష బోర్లకు ఖర్చు అయ్యింది. రూ.1.60వేల నష్టం వచ్చింది.
– చెట్కురి కిష్టయ్య , రైతు, మర్మాముల (సిద్దిపేట జిల్లా)
నాకున్న వ్యవసాయ భూమిలో నాలుగు ఎకరాల మేర మక్క పంట ఏషిన. రోజురోజుకూ బోరు నుంచి నీళ్లు రావ డం తక్కువైంది.నీళ్లు లేక మక్క పంట ఎండిపోతదని భయం పట్టుకుంది. 400 ఫీట్ల వరకు రెండు బోర్లు వేయించినా. రెండింట్లో బొట్టు నీళ్లు రాలే. మొత్తం రూ.95 వేలు ఖర్చు అయ్యింది. మక్క పంట అమ్మినా అంతగానం పైసలు అచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు గింతగానం తక్లిబ్ కాలేదు. అప్పట్ల బోర్ల నుంచి మంచిగ నీళ్లు అంది మస్తు పంటలు పండించుకున్నం. కాంగ్రెస్ సర్కారు అచ్చినంక ఏ ఊర్లోకి వెళ్లినా మళ్ల బోరు బండ్లు కనిపిస్తున్నయి.
– పంపరి రాజశేఖర్, యువరైతు, నిజాంపేట (మెదక్ జిల్లా)