మెదక్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతోంది. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆగస్టు 15 వరకు పరిష్కరించాల్సి ఉంది. మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆగస్టు 15 వరకు దరఖాస్తులు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినా క్షేత్ర స్థాయిలో గడువులోపు అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ సంవత్సరం జూన్ 3 నుంచి 20 వరకు మెదక్ జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 37,817 దరఖాస్తులు వచ్చాయి.
ఇందులో 37,817 దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. అందరికీ నోటీసులు జారీ చేశారు. ఇందులో కేవలం 3590 మాత్రమే పరిష్కారమయ్యాయి. ఆగస్టు 15లోపు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా కొన్ని ఇబ్బందులతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉండగా 6554 సాదా బైనామాలు కాగా, అసైన్డ్‌మెంట్ 7001, పీవోటీలు 4911, టీఎం33(పెండింగ్ మోటేషన్) 913, డీఎస్ పెండింగ్ 883, పేర్ల మార్పులు 503, పట్టా ల్యాండ్, ప్రభుత్వ భూములకు సంబంధించి 640 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో కూడా రెవెన్యూకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 66 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూకు సంబంధించినవి 36 ఉండటం గమనార్హం. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా రావడంతో మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్క రించాలని తహసీల్దార్లు, అదనపు కలెక్టర్‌ను ఆదేశిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కూడా తహసీల్ కార్యాలయాలను తనిఖీ చేస్తూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని సూచిస్తున్నారు. కలెక్టర్ దృష్టి సారిస్తే భూ సమస్యలు పరిష్కారం కానున్నాయి.
మెదక్ జిల్లాలో 21 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో రైతులు వివిధ రకాల భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 37,817 దరఖాస్తులు రాగా, కేవలం 3590 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు. 34,227 పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా సమయం మాత్రం మూడు రోజులే ఉండడంతో పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యే దిశగా అధికారులు
పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు 15 వరకు ఈ దరఖాస్తులు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆ మేరకు రెవెన్యూ అధికారుల పనితీరు సరిగ్గా లేక క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు.