మెదక్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒకటి. ఇండిపెండెంట్ ఇండ్లకు అయితే ప్లాట్ 125 చదరపు గజాలు ఉంటుందని, ఒక వేళ అపార్టుమెంటు తరహా అయితే ఒక ఫ్లాట్‌కు 36 చదరపు గజాల వాటా వచ్చేలా ఉంటుందని ప్లాన్ రూపొందించారు. ఒకో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలతో వీటిని నిర్మించారు. దీనిని 2015లో ప్రారంభించారు.
ఈ పథకాన్ని ముందుగా కేసీఆర్ తన సొంత నియోజకవర్గం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద మొదలు పెట్టారు. మెదక్ జిల్లాలో 4776 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 3975 ఇండ్లకు టెం డర్లు ఫైనల్ చేశారు. 3796 ఇండ్లు ప్రారంభమయ్యాయి. ఇందులో 2981 ఇండ్లు పూర్తి చేశారు. మరో 815 ఇండ్లు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. వీటి కోసం గత ప్రభుత్వం రూ.243 కోట్ల 18 లక్షలు మంజూరు చేసింది. ఇందులో రూ.180 కోట్ల బిల్లులు చెల్లించింది.
మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లికోటల్ సమీపంలో మెదక్ అర్బన్ కింద 950 ఇండ్లు మంజూరయ్యాయి. ఇం దులో 936 ఇండ్లు ప్రారంభంకాగా, 664 పూర్తయ్యాయి. 561 ఇండ్లను గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేశారు. ఇంకా 343 ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 272 ఇండ్లు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. వీటి కోసం రూ.52 కోట్ల 60 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో కాంట్రాక్టర్‌కు రూ.45 కోట్ల 35 లక్షలు బిల్లు చెల్లించింది.
అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఇప్పటికైనా సంబంధితశాఖ ఉన్నతాధికారులు స్పందించి నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అసంపూర్తిగా మిగిలిన పనులను సైతం త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. పంపిణీ కోసం ఎదురుచూస్తున్న వారు మరింత ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇండ్లు లేని నిరుపేదలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదు. ఫలితంగా మూడేండ్ల కిందట పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన నిర్మాణాల్లో గడ్డి, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. మరో వైపు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవకాశం రాక అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లికోటల్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇండ్లల్లో నిరుపేదలు జీవిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుపేదలకు ఇండ్లు కేటాయించలేదు. అంతేకాదు కొన్ని ఇండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. అసలు ఆ ఇండ్లను పట్టించుకునే నాథుడే లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు అడ్డాగా మారాయి. చీకటి పడితే చాలు మందుబాబులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్దకు చేరి మద్యం తాగుతున్నారు. ఖాళీ సీసాలను అకడే పడేసి వెళ్తున్నారు.
ఇండ్లు నిరుపయోగంగా ఉండడంతో కొందరు వలస కూలీలు నివాసం ఉంటున్నారు. డబుల్ ఇండ్ల పరిసరాలు పిచ్చి మొకలతో నిండిపోయాయి. ఇండ్ల చుట్టూ పిచ్చి మొకలు ఏపుగా పెరిగి అకడి పరిసరాలు కళావిహీనంగా మారాయి. చెత్తతో పరిసరాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేదలకు పంపిణీ చేయాలని, మిగతా ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.